FORMULA One: 'ఫార్ములా వన్' రేస్‌లో ముగిసిన 'గ్రిడ్ గర్ల్స్' శకం!

  • ఈ ఏడాది నుంచే వారి స్థానంలో 'గ్రిడ్ కిడ్స్'
  • ఇది యువ రేసర్లకు మేలు చేసే నిర్ణయమన్న ఎఫ్ 1
  • పాత సంప్రదాయాన్ని ఆపడం సరికాదన్న మాజీ బాస్ ఎక్లీస్టోన్

రేసులకు ముందుగా గ్రిడ్ గర్ల్స్‌ని వినియోగించే సంప్రదాయానికి 'ఫార్ములా వన్' ముగింపు పలికింది. ఈ నిర్ణయంతో వారి శకం ముగిసిపోనుంది. ఇకపై వారి స్థానంలో గ్రిడ్ కిడ్స్‌ని ప్రవేశపెట్టాలని ఎఫ్ 1 తాజాగా నిర్ణయం తీసుకుంది. రేసుల్లో పాల్గొనే డ్రైవర్లను ప్రోత్సహించే యంగ్ రేసర్లు గ్రిడ్ కిడ్స్‌గా అవకాశం పొందడం ద్వారా స్టార్ రేసర్ల నుండి వారు ప్రేరణ పొందగలరని ఎఫ్ 1 అధికారులు పేర్కొన్నారు.

మెరిట్ లేదా లాటరీ పద్ధతిలో గ్రిడ్ కిడ్స్‌ని ఎంపిక చేస్తారు. గ్రిడ్ కిడ్స్‌ని తీసుకురావాలనే నిర్ణయం ద్వారా ఈ రేసులు అభిమానులకు ప్రత్యేకించి యువకులకు మరింత ఆసక్తికరంగా మారుతాయని వారు చెప్పుకొచ్చారు. తమ నిర్ణయంపై ఎఫ్ 1 కమర్షియల్ చీఫ్ సీన్ బ్రాచెస్ మాట్లాడుతూ...రేసు ప్రారంభం కావడానికి కొద్ది నిమిషాల ముందుగా స్టార్ రేసర్ల పక్కనే నిల్చుని, వారు రేసుకు ఎలా సన్నద్ధమవుతున్నారన్నది ప్రత్యక్షంగా వీక్షించడం యువ రేసర్లకు చాలా అరుదైన, అద్భుతమైన అవకాశమని ఆయన అభిప్రాయపడ్డారు.

తదుపరి తరం ఫార్ములా 1 హీరోలను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం చక్కగా ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు రేసు ప్రారంభానికి ముందుగా రేసర్లకు అటుఇటు ముద్దుగుమ్మలు హొయలొలికిస్తూ వారిని ప్రోత్సహించే సంప్రదాయానికి స్వస్తి పలుకుతూ తీసుకున్న తాజా నిర్ణయాన్ని ఎఫ్ 1 మాజీ చీఫ్ బెర్నీ ఎక్లీస్టోన్ సహా పలువురు విమర్శిస్తుండటం గమనార్హం.

More Telugu News