kidnap: ఢిల్లీ బాలుడి కిడ్నాప్: గంటన్నర ఛేజింగ్... 4 బైక్ లు, 4 కార్లు, 18 మంది పోలీసులు

  • జనవరి 28న స్కూల్ బస్ నుంచి విహాన్ కిడ్నాప్
  • పక్కా సమాచారంతో కిడ్నాపర్ ను ఫాలో అయిన పోలీసులు
  • డెన్ పై కాల్పులు జరిపి బాలుడ్ని కాపాడిన పోలీసులు

ఢిల్లీలోని ఓ పాఠశాల బస్సు నుంచి అపహరణకు గురైన ఐదేళ్ల బాలుడు విహాన్‌ ను కాపాడేందుకు పోలీసులు చేపట్టిన ఆపరేషన్ 'సి-రివర్' విజయవంతంగా ముగిసింది. ఘటన వివరాల్లోకి వెళ్తే... జనవరి 28 సాయంత్రం స్కూల్ బస్సు నుంచి విహాన్ ను దుండగులు కిడ్నాప్ చేశారు. ఆ రోజు అర్థరాత్రి 12:50 నిమిషాలకు ఘజియాబాద్ లోని సి-రివర్ షాపింగ్ మాల్ నుంచి కిడ్నాపర్లు బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి, 60 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో ఢిల్లీ నేర పరిశోధక బృందం పోలీసులు రంగంలోకి దిగారు. 18 మంది పోలీసులు, నాలుగు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలతో గాలింపు చేపట్టారు.

 ఇంతలో కిడ్నాప్ కు ప్రధాన సూత్రధారి నితిన్‌ కుమార్‌ శర్మ గురించి పోలీసులకు సమాచారం అందింది. బాలుడికి ఆహారం కొనేందుకు నిందితుడు ఢిల్లీలోని వివేక్‌ విహార్‌ ప్రాంతానికి రాబోతున్నాడని, అక్కడి నుంచి వివాహ వేడుకలో పాల్గొనేందుకు వెళ్తున్నాడని సమాచారం అందింది. దీంతో సిద్ధంగా ఉన్న టీమ్ వివేక్ విహార్‌ ప్రాంతానికి చేరుకుంది.

అక్కడ రోడ్లు మరీ చిన్నవిగా ఉండడంతో నిందితుడికి ఏమాత్రం అనుమానం రాకుండా అనుసరించారు. పోలీసులు ఫాలో అవుతున్నట్లు తెలియని నితిన్ పీకల్దాకా తాగి కారులో బయల్దేరాడు. అతనికి ఏమాత్రం అనుమానం రాకుండా పోలీసులు తమ వాహనాలను ముందుకి, వెనక్కి పోనిస్తూ ఫాలో అయ్యారు. కొద్ది దూరం వెళ్లే సరికి నంద్‌ నగ్రి అనే ప్రాంతం వద్ద ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో నితిన్‌ ఎటెళ్లాడో పోలీసులకు అర్థంకాలేదు.

ద్విచక్రవాహనాలపై ఉన్న పోలీసులు నితిన్‌ ని కనిపెట్టగా, అక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో సీమపురి ప్రాంతం వద్ద పోలీసులు నితిన్‌ కారును చుట్టుముట్టారు. దీనిని గుర్తించిన నితిన్‌ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు తన కారుతో వారి వాహనాలపైకి దూసుకెళ్లాడు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన పోలీసులు నితిన్‌ ని పట్టుకుని విచారించగా, బాలుడ్ని దాచిన ప్రదేశం గురించి చెప్పేశాడు.

దీంతో బాలుడిని దాచిన భవనం చుట్టూ పోలీసులను మోహరించి, ఏమీ తెలియనట్టుగా నితిన్ చేత కిడ్నాపర్ సహచరులకు ఫోన్ చేయించారు. అయితే అనుమానం వచ్చిన కిడ్నాపర్లు లాక్‌ చేసిన మెయిన్ తలుపు తెరవకుండా పక్కనే ఉన్న చెక్క తలుపు తెరిచారు.

ఆ వచ్చిన కిడ్నాపర్, పోలీసులను గుర్తించి, సహచరులను అప్రమత్తం చేస్తూ, 'భవనాన్ని పోలీసులు చుట్టుముట్టారు' అంటూ కేకలు వేశాడు. దీంతో కిడ్నాపర్లు తుపాకులతో బయటకి వచ్చి కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఎదురు కాల్పుల్లో కిడ్నాపర్ ను త్యాగి అనే పోలీసు అధికారి హతమార్చగా, మరో కిడ్నాపర్‌ బాలుడ్ని చంపేందుకు దూసుకెళ్లాడు. అతనిపై కాల్పులు జరపడంతో బాలుడు బతికి బయటపడ్డాడు. తలుపులు పగులగొట్టి బాలుడ్ని కాపాడి, తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.

More Telugu News