Chandrababu: జైట్లీ పద్ధతి సరిగా లేదు.. రెండు రోజులే ఉంది.. ఏ మాత్రం తగ్గొద్దు: ఎంపీలకు చంద్రబాబు ఆదేశం

  • కేంద్రంపై ఒత్తిడి మరింత పెంచండి
  • ఏపీకి జరుగుతున్న అన్యాయంపై ఖర్గే ఎందుకు మాట్లాడలేదు
  • ఏం చేయబోతున్నారో కేంద్రం స్పష్టం చేయాల్సిందే

ఏపీకి అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై పార్లమెంటు సమావేశాల్లో నిరసన తెలపాలని ఇప్పటి వరకు టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేసిన ఆయన... తాజాగా తీవ్రతను మరింత పెంచారు. పార్లమెంటు సమావేశాలు మరో రెండు రోజులు మాత్రమే ఉన్నాయని... నిరసన వ్యక్తం చేసే క్రమంలో ఏ మాత్రం తగ్గవద్దని, కేంద్రంపై ఒత్తిడిని మరింత పెంచాలని తమ ఎంపీలను ఆదేశించారు.

నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ ఎంపీలపై అనవసర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మల్లికార్జున ఖర్గేపై చంద్రబాబు మండిపడ్డారు. ఏపీకి జరిగిన అన్యాయంపై ఖర్గే ఎందుకు మాట్లాడలేదని ఆయన ధ్వజమెత్తారు. ఆర్థిక మంత్రి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ అమలును సమీక్షించాలని అన్నారు. పార్లమెంటు సాక్షిగా ఏపీకి జరుగుతున్న అన్యాయంపై చర్చించాలని డిమాండ్ చేశారు. విభజన సమస్యలపై పార్లమెంటులో కనీసం 2 గంటల పాటు ప్రత్యేక చర్చ జరగాలని అన్నారు.

5 కోట్ల మంది ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుంటే, ఆ మాత్రం సమయాన్ని కూడా కేటాయించలేరా? అంటూ మండిపడ్డారు. ఏపీకి ఎంత నష్టం జరిగింది? గత నాలుగేళ్లలో ఏపీకి కేంద్రం ఏం చేసింది? ఇప్పుడు ఏం చేయబోతున్నారో స్పష్టంగా చెప్పాల్సిందేనని ముఖ్యమంత్రి అన్నారు. కేవలం నాబార్డు నిధుల గురించి మాత్రమే ప్రస్తావించి, మిగిలిన వాటిని వదిలేయడం అరుణ్ జైట్లీకి కరెక్ట్ కాదని అన్నారు. 

More Telugu News