Maldives: యమీన్ దెబ్బకు వెనక్కి తగ్గిన మాల్దీవుల సుప్రీంకోర్టు.. రాజకీయ ఖైదీల విడుదల నిర్ణయం వెనక్కి!

  • 9 మంది హై ప్రొఫైల్ రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని గతంలో ఆదేశం
  • దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన అధ్యక్షుడు యమీన్
  • గత అర్ధరాత్రి అత్యవసరంగా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న సుప్రీం కోర్టు

మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ దెబ్బకు సుప్రీంకోర్టే వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దేశంలో అత్యవసర పరిస్థితికి కారణమైన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. తొమ్మిది మంది రాజకీయ ఖైదీలను విడుదల చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ మేరకు మంగళవారం రాత్రి ప్రకటించింది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు జోక్యం చేసుకోవాలంటూ మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్ భారత సాయాన్ని కోరడంతో  సుప్రీం ఈ నిర్ణయం తీసుకుంది.

రాజకీయ ఖైదీలను విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించడం, దానిని అధ్యక్షుడు బేఖాతరు చేయడంతో దేశంలో అల్లర్లు చెలరేగాయి. తనను అభిశంసించేందుకు సుప్రీం ప్రయత్నిస్తోందంటూ దేశాధ్యక్షుడు ఆరోపించారు. మరోవైపు తమను తొలగించేందుకు యమీన్ ప్రయత్నిస్తున్నారని న్యాయమూర్తులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో దేశంలో రాజకీయ సంక్షోభం నెలకొంది.

 దీంతో సోమవారం రాత్రి అధ్యక్షుడు 15 రోజుల అత్యవసర పరిస్థితి ప్రకటించారు. అంతేకాదు చీప్ జస్టిస్ అబ్దుల్లా, న్యాయమూర్తి అలీ అహ్మద్‌లను అరెస్ట్ చేశారు. దీంతో పరిస్థితి చేయిదాటే అవకాశం కనిపిస్తుండడంతో మిగతా ముగ్గురు న్యాయమూర్తులు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకున్నారు. 9మంది హై ఫ్రొఫైల్ రాజకీయ ఖైదీలను విడుదల చేయాలంటూ  ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్టు మంగళవారం రాత్రి పొద్దుపోయాక ప్రకటించారు. అధ్యక్షుడి ఆందోళనను దృష్టిలో పెట్టుకుని ఆదేశాలను ఉపసంహరించుకున్నట్టు న్యాయమూర్తులు తెలిపారు.

More Telugu News