Andhra Pradesh: జర్మనీ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికిన ఏపీ మంత్రి అమరనాథ్ రెడ్డి

  • జర్మనీ రాజధాని బెర్లిన్ లో పర్యటించిన మంత్రి
  • పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ
  • ఏపికి పెట్టుబడులు పెట్టమని కోరిన అమరనాథ్ రెడ్డి

పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని జర్మనీ పారిశ్రామికవేత్తలను ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ అమరనాథ రెడ్డి కోరారు. జర్మనీ రాజధాని బెర్లిన్ లో ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా పలు కంపెనీల ప్రతినిధులతో చర్చించారు. మొదట హర్బర్ కంపెనీ సీఈఓ అలెక్స్ బెర్న్ సోర్ఫ్, అప్లుస్ ఆటో ఉపాధ్యక్షుడు హాన్స్ జుర్గన్ చింప్ జెన్ లతో ఆయన సమావేశమయ్యారు. ఇప్పటికే ప్రపంచస్థాయి కంపెనీలు కియా, అపోలో, హీరో తదితర కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టిన విషయాన్ని వారితో అమర్ నాథ్ రెడ్డి ప్రస్తావించారు. పెట్టుబడులతో వస్తే పరిశ్రమ ఏర్పాటుకు కావాల్సిన అన్ని అనుమతులను వేగంగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.అనంతరం మధ్య తరహా పరిశ్రమల ప్రతినిధులతో అమర్ నాథ్ రెడ్డి సమావేశమయ్యారు. తమ కంపెనీ వ్యాపార కార్యకలాపాల విస్తరణకు ఆంధ్రప్రదేశ్ ను ఎంచుకోవాలని ఆయా కంపెనీల ప్రతినిధులను కోరారు. ఈ సందర్భంగా తరింజన్ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి బెంజమిన్ తో భేటీ అయ్యారు. ఏపీలో పర్యటించి ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు బెంజమిన్ సానుకూలంగా స్పందించారు. ఈ ఏడాది ఆగస్టులో తరింజన్ రాష్ట్ర వాణిజ్య శాఖ మంత్రి, సంబంధిత అధికారులు ఏపీలో పర్యటిస్తారని మంత్రికి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఆర్ ప్రీతమ్ రెడ్డి, ఈడిబి అధికారులు పాల్గొన్నారు.

More Telugu News