stock market: ఒక్కరోజులో 32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు!

  • 500 బిలియనీర్లకు చెందిన 7 లక్షల 32 వేల కోట్లు ఆవిరి
  • వారెన్ బఫెట్ నష్టం 32 వేల కోట్ల రూపాయలు
  • జుకెర్ బర్గ్ నష్టం 23 వేల కోట్ల రూపాయలు

 అమెరికా స్టాక్ మార్కెట్ల పతనం ఆ దేశ కుబేరుడిపై తీవ్రప్రభావం చూపింది. డౌజోన్స్ పతనం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 500 మంది బిలియనీర్లకు చెందిన లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ లలో పెట్టుబడులు పెట్టిన సంపన్నులు సుమారు 7 లక్షల 32 వేల కోట్ల రూపాయలు నష్టపోయారని బ్లూమ్‌ బర్గ్ అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా సుమారు 500 కోట్ల డాలర్లు (32 వేల కోట్ల రూపాయలు) నష్టపోయిన వ్యక్తి బెర్క్‌ షైర్ హాథవే చైర్మన్ వారెన్ బఫెట్. కేవలం 24 గంటల వ్యవధిలో ఆయన ఈ మొత్తాన్ని కోల్పోవడం విశేషం.

డౌజోన్స్ లో 9.2 శాతం మేర పతనమైన వెల్స్ అండ్ ఫార్గో కంపెనీలో మెజారిటీ వాటా బెర్క్‌ షైర్ కంపెనీదే కావడంతో బఫెట్ భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఆ తరువాతి స్థానంలో ఫేస్‌ బుక్ సీఈవో మార్క్ జుకెర్‌ బర్గ్ 360 కోట్ల డాలర్లు (23 వేల కోట్ల రూపాయలు) నష్టపోయాడు. అటు ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా నీరాజనాలందుకుంటున్న అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ కూడా సుమారు 21 వేల కోట్ల రూపాయల సంపదను కోల్పోయారు. ఆల్ఫాబెట్ ఓనర్లు లారీ పేజ్, సెర్గీ బ్రిన్‌ లు కూడా సుమారు 15 వేల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసినట్టు తెలుస్తోంది. భారీ మొత్తంలో నష్టాలు చవిచూడడంతో పారిశ్రామిక వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. 

More Telugu News