క్రిప్టో కరెన్సీ కోర్సులకు డిమాండ్... ఆరు నెలల్లో 290 శాతం పెరిగిన ఉద్యోగ అవకాశాలు

06-02-2018 Tue 13:22
  • పెరుగుతున్న బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వినియోగం
  • భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలు
  • ఇండీడ్ ఇండియా సంస్థ వెల్లడి
బిట్ కాయిన్, రిపుల్, ఎథీరియం తదితర క్రిప్టోకరెన్సీలకు ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్లలో క్రేజ్ ఏర్పడింది. ఫలితంగా ఇవి భారీ ర్యాలీ చేశాయి. క్రిప్టోకరెన్సీలు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తాయి. ఎంత పెద్ద ఆర్థిక లావాదేవీలు అయినా సులభంగా చేసుకునే వీలుంటుంది. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వినియోగం పెరగడంతో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు, కోర్సులకు డిమాండ్ ఏర్పడింది.

‘ఎడ్యురేక’లో 350 మంది ఐదు నెలల కోర్సులో ప్రవేశాలు పొందగా, ‘ఇంటెల్లిపాట్’లో 500 మంది చేరారు. ‘సింప్లి లెర్న్’ నెల క్రితం కోర్సు ప్రారంభించగా 100 మంది చేరిపోయారు. గత వారం ‘అకాడ్ గ్లిడ్’ సైతం కోర్స్ ను ప్రారంభించింది. క్రిప్టోకరెన్సీలకు ఆధారమైన బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ప్రాచుర్యం సంతరించుకోవడంతో ప్రస్తుతం దీన్ని ఫైనాన్స్, స్మార్ట్ కాంట్రాక్టులు, డిజిటల్ గుర్తింపులకు వాడుతున్నారు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీలో డిజిటల్ లెడ్జర్లు నిర్వహించే అవకాశం కూడా ఉంది.

2017 నవంబర్ కు ముందు ఆరు నెలల కాలంలో బ్లాక్ చెయిన్ ఉద్యోగాలు 290 శాతం పెరిగినట్టు రిక్రూట్ మెంట్ వేదిక అయిన ఇండీడ్ తెలిపింది. బ్లాక్ చెయిన్ డెవలపర్, బ్లాక్ చెయిన్ కన్సల్టెంట్, సిస్టమ్ ఆర్కిటెక్ట్ అన్నవి టాప్ ఉద్యోగాలుగా పేర్కొంది. బ్లాక్ చెయిన్ ఆధారిత ఉత్పత్తులు, సేవల మార్కెట్ అంతర్జాతీయంగా 2022 నాటికి 7.7 బిలియన్ డాలర్ల (సుమారు రూ.50,000 కోట్లు) స్థాయికి చేరుతుందని ఇండీడ్ ఇండియా ఎండీ శశికుమార్ తెలిపారు. దీంతో భవిష్యత్తులో ఈ రంగంలో మరిన్ని ఉద్యోగాలు వస్తాయన్నారు.