Sangareddy jail: ఫీల్ ది జైల్‌.. జైలు సరదా తీర్చుకున్న కుబేరుడు!

  • సంగారెడ్డి జైలులో అతిథి ఖైదీగా కుబేరుడు
  • 'ఫీల్ ది జైల్‌'కు వచ్చిన కేరళ నగల వ్యాపారి బాబీ
  • ఒక్క రోజు ఖైదీగా జైలు జీవితానుభవం

సాధారణంగా ఏదైనా నేరం చేయాలి... చేసిన నేరం కోర్టులో సాక్ష్యాధారాలతో రుజువు కావాలి. అప్పుడే నిందితుడు దోషిగా నిర్థారించబడి జైలుకెళ్తాడు. చట్టం తన పని తాను ఈ రకంగా చేసుకుపోతుంటుంది. కానీ 'ఫీల్ ది జైల్' పేరుతో తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ కల్పించిన అవకాశం నేపథ్యంలో పలువురు జైలు జీవితం ఎలా ఉంటుందో లైఫ్‌లో కనీసం ఒక్కసారైనా అనుభవిద్దాం.. అంటూ గెస్ట్ ఖైదీలుగా జైలులో గడుపుతుండటం ఇటీవల కాలంలో చూస్తున్నాం.

కోట్లకు పడగలెత్తిన బాబీ చెమ్మనూర్ అనే కేరళ నగల వ్యాపారి తాజాగా ఇదే రీతిలో తన జైలు సరదా తీర్చుకున్నారు. ఇతర ఖైదీలకు అందించే ఆహారాన్నే ఆయన కూడా తిన్నారు. చెమ్మనూర్ తన స్నేహితులు అషీర్ అలీ, ప్రశాంత్, వినయ్‌లతో కలిసి సోమవారం సంగారెడ్డి జిల్లాలోని పాత జైలుకు వచ్చారు. జైలు అధికారులకు తన మదిలో ఉన్న జైలు జీవిత అనుభవ వాంఛను ఆయన వివరించారు.

దాంతో అధికారులు ఇచ్చిన తెలుపు రంగు ఖైదీల దుస్తులను తాను కూడా తొడుక్కున్నారు. ఖైదీల ఆహారాన్నే తాను కూడా తిన్నారు. ఇలా ఒక్క రోజు జైలు జీవిత అనుభవం కోసం ఆయన తనకు, తన మిత్రులకు కలిపి రోజుకు ఒక్కోక్కరికి రూ.500 చొప్పున నలుగురికి రూ.2000 రుసుం చెల్లించారు.

జైలు బయటకు వచ్చిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...జైలు జీవితం గడపాలన్నది తన చిరకాల కోరిక అని, ఇందుకోసం తాను 15 ఏళ్ల కిందటే ఒక పోలీసు అధికారిని సంప్రదించానని ఆయన చెప్పారు. భారత్, అమెరికా, గల్ఫ్ దేశాల్లో తనకు బంగారు నగల వ్యాపారాలు ఉన్నాయని...సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ తాను పాలుపంచుకుంటున్నానని...కేరళలో మానసిక రోగుల కోసం ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేశానని ఈ సందర్భంగా బాబీ చెప్పుకొచ్చారు.

More Telugu News