Facebook: ఇంతకీ మీరెవరూ?.. చెప్పేయనున్న ఫేస్‌బుక్.. పేటెంట్ కోసం దరఖాస్తు

  • మీరు ధనవంతులో.. పేదలో చెప్పే సాంకేతికతను సిద్ధం చేసిన ఫేస్‌బుక్
  • ప్రత్యేక ప్రశ్నావళితో యూజర్ల ముందుకు
  • వ్యాపార వర్గాలను యూజర్లకు దగ్గర చేసేందుకేనన్న సోషల్  మీడియా దిగ్గజం

మీరేపాటి ధనవంతులో ఇక ఫేస్‌బుక్ చెప్పేస్తుంది. ఇందుకు సంబంధించిన టెక్నాలజీ పేటెంట్ కోసం ఫేస్‌బుక్ దరఖాస్తు చేసుకుంది. వర్కింగ్ క్లాస్, మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్ అనే మూడు క్లాస్‌ల ద్వారా ఫేస్‌బుక్ ఆటోమెటిక్‌గా ఈ విషయాన్ని గుర్తిస్తుంది.

పేటెంట్ కోసం చేసుకున్న దరఖాస్తు ప్రకారం.. ఫేస్‌బుక్ ప్రత్యేకంగా ఓ సాంకేతికతను సిద్ధం చేసింది. యూజర్ల నుంచి విద్యార్హతలు, ఇంటి వివరాలు, ఇంటర్నెట్ వినియోగం తదితర వివరాలను సేకరించి వారి సామాజిక స్థితిగతులను చెప్పనుంది.

యూజర్ల వయసు ఆధారంగా ఓ ప్రశ్న పత్రాన్ని రూపొందించిన ఫేస్‌బుక్ వాటిని యూజర్ల ముందు పెట్టి వివరాలు సేకరిస్తుంది. 20-30 ఏళ్ల మధ్య యువకులైతే ఇంటర్నెట్ వినియోగంపైనా, 30-40 ఏళ్ల మధ్య వారైతే సొంతింటికి సంబంధించిన ప్రశ్నలు, సందర్శించిన పర్యాటక ప్రదేశాలు తదితర వాటిపై ప్రశ్నలు సంధిస్తుంది. తమ వేతనానికి సబంధించిన ప్రశ్నకు జవాబును మాత్రం యూజర్లకే వదిలేస్తోంది. ఈ ప్రశ్నకు ఇష్టం ఉంటే సమాధానం చెప్పవచ్చు, లేదంటే లేదు.

సోషల్ మీడియా దిగ్గజమైన ఫేస్‌బుక్ తమ యూజర్లు ఎటువంటి వారో ఎందుకు తెలుసుకోవాల్సి వస్తోందన్న ప్రశ్నకు కూడా సమాధానం చెప్పింది. వ్యాపార వర్గాల ఉత్పత్తులను యూజర్ల స్థాయిని బట్టి వారి చెంతకు చేరవేసేందుకే ఈ సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు పేర్కొంది. ఇలా  చేయడం వల్ల వ్యాపార వర్గాలు తమ ఉత్పత్తులను చాలా సులభంగా ప్రజలను చేరుకునే అవకాశం ఉందని ఫేస్‌బుక్ అభిప్రాయపడింది.  

More Telugu News