USA: భారీగా నష్టపోయిన యూఎస్ మార్కెట్... తీవ్ర ఆందోళనలో భారత మదుపరులు!

  • 400 పాయింట్లకు పైగా పతనమైన డౌజోన్స్
  • 3.8 శాతం దిగజారిన నాస్ డాక్ కాంపోజిట్
  • భారీగా అమ్మకాలకు పాల్పడుతున్న ఇన్వెస్టర్లు 
  • సెన్సెక్స్, నిఫ్టీలపైనా ప్రభావం

అమెరికా మార్కెట్ భారీగా పతనమై ఇన్వెస్టర్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఈ సీజన్ లో ఇప్పటికే 1,175 పాయింట్లు పడిపోయిన డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ సోమవారం నాడు మరో 400 పాయింట్లు పడిపోయింది. మరోవైపు ఎస్అండ్ పీ 500 కూడా నేల చూపులు చూస్తోంది. భారత కాలమానం ప్రకారం, ఉదయం 8 గంటల సమయంలో డౌజోన్స్ సూచిక 25,148 పాయింట్ల వద్ద కొనసాగుతూ, గత వారాంతపు ముగింపుతో పోలిస్తే ఒకటిన్నర శాతం దిగజారింది.

ఎస్ అండ్ పీ 500 సూచిక, గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంత పతనాన్ని నమోదు చేసింది. ఆగస్టు 2011 తరువాత ఈ ఇండెక్స్ 4.1 శాతం పతనాన్ని కళ్లజూడటం ఇదే తొలిసారి. గత నెలలో రికార్డు స్థాయిలో ఉన్న మార్కెట్లు ఇంతలా పతనం కావడానికి ఇన్వెస్టర్లలో నెలకొన్న భయాందోళనలే కారణమని నిపుణులు వ్యాఖ్యానించారు. మరోవైపు నాస్ డాక్ కాంపోజిట్ 3.8 శాతం పడిపోయి 6,967 పాయింట్లకు చేరింది. ఇన్వెస్టర్లు పెద్దఎత్తున ఈక్విటీల విక్రయాలకు దిగుతుండటం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లను కలవరపెడుతోంది.

గత శుక్రవారం నాడు 665 పాయింట్లు పడిపోయిన డౌజోన్స్, గత వారంలో వడ్డీ రేట్లు పెరుగుతున్నాయని నివేదికలు వచ్చిన తరువాత అమ్మకాల వెల్లువ మొదలైంది. జనవరిలో గరిష్ఠ స్థాయిలో ఉన్న ఎన్నో కంపెనీలు, ఇప్పుడు ఆల్ టైమ్ హైతో పోలిస్తే, 5 నుంచి 10 నష్టాల్లో సాగుతున్నాయి. ఇక అమెరికా మార్కెట్ల సరళి, ఆసియా మార్కెట్లపై ప్రధానంగా మరో గంట తరువాత ప్రారంభమయ్యే సెన్సెక్స్, నిఫ్టీల ట్రేడింగ్ పై పడుతుందని విశ్లేషకులు హెచ్చరించారు.

సెన్సెక్స్ సూచిక ఆరంభంలోనే 300 పాయింట్ల వరకూ పతనం కావచ్చని అంచనా వేస్తున్నారు. బడ్జెట్ తరువాత సెంటిమెంట్ దెబ్బతిని, రెండు రోజుల్లో 1000 పాయింట్లకు పైగా పతనమైన సంగతి తెలిసిందే. ఆ ప్రభావం నుంచి ఇంకా కోలుకోకముందే అమెరికా మార్కెట్ల పతన వార్తలు మదుపరుల సెంటిమెంట్ ను హరిస్తున్నాయని మార్కెట్ పండితులు వ్యాఖ్యానించారు.

More Telugu News