Telugudesam: సోము వీర్రాజు.. కోతలరాయుడా? మిత్రద్రోహా? జగన్మోహన్ రెడ్డి ఏజెంటా?: టీడీపీ నేత జీవీ ఆంజనేయులు

  • సోము వీర్రాజుపై మండిపడ్డ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
  • మిత్రపక్షం కోటాలో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చాం
  • కృతజ్ఞతా హీనుడు సోము వీర్రాజు
  • ఇలాంటి వాళ్ల వల్ల బీజేపీ ప్రతిష్ట మంటగలసిపోతోంది

టీడీపీ, ఆ పార్టీ అధినేత, నాయకులపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర వ్యాఖ్యలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని, అదేసమయంలో, మిత్రధర్మాన్నీ గౌరవిస్తామని అన్నారు. కానీ, మిత్రధర్మాన్ని పాటించని సోము వీర్రాజు మిత్రద్రోహిగా తయారయ్యారని విమర్శించారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న సోము వీర్రాజు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని హితవు పలికారు.

‘బీజేపీలో సోము వీర్రాజుని ‘కోతలరాయుడు’ అని అంటున్నారు. సోము వీర్రాజు కోతలరాయుడా? మిత్రద్రోహా? లేకుంటే జగన్మోహన్ రెడ్డి ఏజెంటా? ఇందుకు సోము వీర్రాజు సమాధానం చెప్పాలి. తెలుగుదేశం పార్టీని విమర్శించడం మానుకుని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ కు నిధులు వచ్చేట్టు చేసి, ప్రయోజనాలు కాపాడితే ఈ సోము వీర్రాజుని ప్రజలు మెచ్చుకుంటారు. బీజేపీకి గౌరవం, ప్రజల్లో ఆదరణ పెరుగుతాయి.

అంతేతప్పా, జగన్మోహన్ రెడ్డి ఏజెంట్ గా సోము వీర్రాజు వ్యవహరిస్తే బీజేపీ పరువు మంటగలిసిపోతుంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సోము వీర్రాజు కంటే ఇండిపెండెంట్ అభ్యర్థికే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అయినా, మిత్రధర్మాన్ని గౌరవించి, బీజేపీ అధిష్ఠానం కోరిక మేరకు మిత్రపక్షం కోటాలో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చాం. కనీసం కృతజ్ఞత కూడా చూపడం లేదు.. కృతజ్ఞతా హీనుడు సోము వీర్రాజు. ఇలాంటి వాళ్ల వలన బీజేపీ ప్రతిష్ట మంటగలసిపోతోంది. ఇలాంటి వాళ్లు మా పార్టీలో ఉంటే సస్పెండ్ చేసి ఉండేవాళ్లం. సోము వీర్రాజుని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయమని అడగం.. సన్మార్గంలో నడవమని కోరుతున్నాం’ అని ఆంజనేయులు నిప్పులు చెరిగారు. 

More Telugu News