somu veerraju: నేను ఎవరికీ భయపడను.. నన్ను ఎమ్మెల్సీ చేసింది బీజేపీనే: సోము వీర్రాజు

  • మిత్రధర్మంలో భాగంగానే ఎమ్మెల్సీ పదవి వచ్చింది
  • నన్ను టార్గెట్ చేస్తే, వారే ఇబ్బంది పడతారు
  • టీడీపీతో పొత్తును నిర్ణయించేది పార్టీ అధిష్ఠానమే

ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఎంతో చేస్తున్నప్పటికీ, ఎలాంటి సహకారం అందడం లేదని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు చాలా దారుణమని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. తనను ఎమ్మెల్సీ చేసింది బీజేపీ అని... టీడీపీ కాదని ఆయన తెలిపారు. మిత్ర పక్షంలో ఒప్పందం మేరకు తనకు ఎమ్మెల్సీ పదవి వచ్చిందని చెప్పారు. ముగ్గురు కలసి పోటీ చేస్తేనే ఏపీలో అధికారం వచ్చిందని తెలిపారు. టీడీపీ నేతల విమర్శలకు దీటుగా సమాధానం చెప్పగలనని అన్నారు.

తాను ఎవరికీ భయపడబోనని వీర్రాజు చెప్పారు. బుద్దా వెంకన్న సహా తనను విమర్శిస్తున్న వారందరూ తనకు స్నేహితులేనని అన్నారు. వెనుక నుంచి ఎవరో రాసిస్తేనే, వాళ్లు మాట్లాడుతున్నారని చెప్పారు. తనను టార్గెట్ చేస్తే ఇబ్బంది పడతారని హెచ్చరించారు. జగన్ పార్టీతో తనకు కానీ, తమ పార్టీకి కానీ ఎలాంటి సంబంధం లేదని అన్నారు. పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తనకు ఎలాంటి సొంత అజెండా లేదని ఆయన స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తు తెగిపోతుందని తాను ఎన్నడూ చెప్పలేదని... దీన్ని నిర్ణయించేది పార్టీ అధిష్ఠానమని చెప్పారు. 

More Telugu News