nri: ఎన్ఆర్ఐ భార్యలకు వేధింపులు.. బాధితుల్లో తెలుగు వారే ఎక్కువట!

  • సాయం కోరుతూ బాధిత మహిళల ఆక్రందన
  • ప్రతీ 8 గంటలకు ఓ ఫోన్ కాల్
  • ఏపీ, తెలంగాణకు చెందిన వారు ఎక్కువే

ఎన్ఆర్ఐ సంబంధం అంటే ఓ స్టేటస్ గా, గొప్పగా భావిస్తుంటారు చాలా మంది ఆడ పిల్లల తల్లిదండ్రులు. కానీ, ఈ గణాంకాలు వింటే వారి ఆలోచనను విరమించుకుంటారేమో. ప్రతీ 8 గంటలకు ఓ ఎన్ఆర్ఐ భార్య తనకు భర్త వేధింపుల నుంచి విముక్తి కల్పించాలని, స్వదేశం తిరిగొచ్చేందుకు సాయం చేయాలని కోరుతూ కాల్ చేస్తోంది. 2015 జనవరి 1 నుంచి 2017 నవంబర్ 30 వరకు 1,064 రోజుల్లో విదేశాంగ శాఖకు ఇలా సాయం కోరుతూ వచ్చిన కాల్స్ 3,328. అంటే రోజుకు మూడు చొప్పున, సగటున 8 గంటలకు ఒక కాల్ వచ్చినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ తరహా బాధిత మహిళల్లో ఎక్కువ మంది పంజాబ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచే ఉండడం ఆందోళన కలిగించే అంశం.  

బాధితుల్లో మనోళ్లే ఎక్కువ
వాషింగ్టన్ డీసీలో భారత ఎంబసీలో 16 ఏళ్ల పాటు పనిచేసిన ఆర్తిరావ్ మాట్లాడుతూ... చాలా మంది మహిళలు ఏపీ (తెలంగాణ సహా) నుంచే ఉంటున్నారని, అక్కడ వరకట్న విధానం ఇప్పటికీ బలంగా ఉందన్నారు. అబ్బాయిలు భారత్ కు వెళ్లి ఎవరో ఒకర్ని పెళ్లి చేసుకుంటున్నారు గానీ వారితో కలసి జీవించే ఉద్దేశం ఉండడం లేదన్నారు. ఆడ పిల్లల తల్లిదండ్రుల్లో ఎన్ఆర్ఐ అల్లుడన్న ఆలోచనా విధానంలోనే తప్పు ఉందని సామాజిక కార్యకర్త సమతా దేశ్ మానే పేర్కొన్నారు.

More Telugu News