anti biotics: భారత్‌లో విచ్చలవిడిగా అనామోదిత యాంటీబయాటిక్స్ విక్రయాలు!

  • విచ్చలవిడిగా సాగుతున్న యాంటీ బయాటిక్స్ అమ్మకాలు
  • నానాటికీ పెరుగుతున్న క్రమబద్ధీకరించని ఔషధ విక్రయాలు
  • క్వీన్ మేరీ వర్శిటీ అధ్యయనం

బహుళజాతి కంపెనీలు భారత్‌లో క్రమబద్ధీకరించని యాంటీబయాటిక్స్ తయారీ, విక్రయాలను విచ్చలవిడిగా కొనసాగిస్తూనే ఉన్నాయి. పర్యవసానంగా దేశంలో యాంటీమైక్రోబయాల్ రెసిస్టెన్స్-ఎ.ఎం.ఆర్(సూక్ష్మజీవ నిరోధకత) సమస్య మరింత జటిలమవడమే కాక ప్రపంచవ్యాప్తంగా డ్రగ్ నిరోధానికి చేస్తున్న ప్రయత్నాలు నీరుగారిపోయే పరిస్థితి నెలకొంటోందని యూకే అధ్యయనం ఒకటి వెల్లడించింది.

ఈ పరిశోధనా నివేదికను బ్రిటీష్ జర్నల్ ఆఫ్ క్లినికల్ ఫార్మాకాలజీలో ప్రచురించారు. లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్శిటీ, న్యూక్యాజిల్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదికను సోమవారం బహిర్గతం చేశారు. ఈ నివేదిక ప్రకారం.... భారత మార్కెట్‌‌తో పాటు బ్రిటన్ లేదా అమెరికాలో విక్రయమవుతున్న లక్షలాది యాంటీబయాటిక్ మందులు క్రమబద్ధీకరించబడటం లేదు.

2007-2012 మధ్యకాలంలో భారత్‌లో వివిధ ఫార్ములేషన్‌లకు సంబంధించి సుమారు 118 రకాల ఫిక్సిడ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్‌.డి.సి) యాంటీబయాటిక్స్ విక్రయం జరిగింది. భారత్‌లో ఆమోదం లేని కొత్త ఔషధాల విక్రయం లేదా సరఫరా చట్టవిరుద్ధమైనప్పటికీ, వాటిలో 64 శాతం సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సి.డి.ఎస్‌.సి.ఒ) ఆమోదం పొందకపోవడం ఆందోళన కల్గించే విషయం. కాగా, అమెరికా, బ్రిటన్‌లలో 4 శాతం ఎఫ్‌.డి.సి లు మాత్రమే ఆమోదం పొందాయి.  ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. యాంటీబయాటిక్‌ల వినియోగం, ఎ.ఎం.ఆర్ పరంగా భారత్ ఇప్పటికే ఒకానొక అత్యధిక రేట్లను కలిగిన దేశంగా ఉండటం గమనార్హం.

 మరోవైపు పేలవమైన రీతిలో ఎంపిక చేసుకున్న యాంటీమైక్రోబయాళ్లతో కూడిన పలు అనామోదిత ఎఫ్‌.డి.సిలు నిరోధకత సమస్యలు మరింత క్లిష్టతరంగా మారేందుకు కారణమవుతున్నాయి. 12 బహుళజాతి కంపెనీలు సహా దాదాపు 500 ఫార్మా కంపెనీలు 3300 పై చిలుకు బ్రాండ్ పేర్లతో ఎఫ్‌.డి.సి యాంటీబయాటిక్స్ విక్రయం జరిగాయి. అబోట్, ఆస్ట్రా జెనికా, బక్స్‌టర్, బేయర్ ఎలీ లిల్లీ, గ్లాక్సోస్మిత్-కెలైన్, మెర్క్/ఎం.ఎస్‌.డి, నోవార్టిస్, పిఫైజర్, శానోఫి-అవెంటిస్, వైత్ కంపెనీలు మొత్తం 188ఎఫ్‌.డి.సిలలో 45 శాతాన్ని 148 బ్రాండ్ పేర్లతో తయారు చేశాయి.

 వాటిలో 62 శాతం సి.డి.ఎస్‌.సి.ఒ ఆమోదం పొందగా 8 శాతం మాత్రమే అమెరికా లేదా బ్రిటన్‌లలో ఆమోదం పొందాయి. కాగా, బహుళజాతి కంపెనీలు తయారు చేసిన 38 శాతం ఎఫ్‌.డి.సి ఫార్ములేషన్లకు సి.డి.ఎస్‌.సి.ఒ ఆమోదం పొందినట్లు రికార్డు లేకపోవడం గమనార్హం. వాటిలో 90 శాతాన్ని అబోట్ కంపెనీ తయారు చేసింది. 2011-12 నాటికి, భారత్‌లో విక్రయం జరిగిన మొత్తం యాంటీబయాటిక్స్‌లలో ఎఫ్‌.డి.సి లు మూడో వంతును ఆక్రమించాయి. వాటిలో 34.5శాతం ఎఫ్‌.డి.సి లు అనామోదిత ఫార్ములేషన్‌లే! 

More Telugu News