Italy: ఇటలీ యువతిని చైనాలో కలిసిన భారత టెక్కీ... హిందూ సంప్రదాయంలో అందమైన పెళ్లి!

  • ఓ ఈవెంట్ లో కలిసిన సుబ్రమోని, ఫ్లావియా
  • పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దల అంగీకారం
  • నాగర్ కోయిల్ లో వైభవంగా వివాహం

వివాహాలు స్వర్గంలోనే నిశ్చయింపబడతాయి అన్న నానుడికి తాజా ఉదాహరణే ఈ పెళ్లి. ఎక్కడో ఇటలీలో పుట్టి, చైనాలో ఉద్యోగం చేసుకుంటున్న ఓ యువతికి, తమిళనాడులో పుట్టి, ఉద్యోగం నిమిత్తం చైనాకు వెళ్లిన యువకుడికి రాసిపెట్టి ఉన్నాడా దేవుడు. వీరిద్దరి వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం తమిళనాడులోని నాగర్ కోయిల్ లో వైభవంగా జరిగింది. పట్టుచీర కట్టుకుని, నగలు పెట్టుకుని, ముసిముసినవ్వులతో సిగ్గుపడుతున్న తన మనసు దోచిన మగువ మెడలో, బంధుమిత్రుల సమక్షంలో, మేళ తాళాలు మోగుతుండగా, వేదమంత్రాల నడుమ తాళికట్టాడా వరుడు.

చైనాలో ఉన్న ఇండియన్ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్న ఎ.సుబ్రమోని అనే యువకుడికి, చైనాలోనే పని చేస్తున్న ఇటలీకి చెందిన ఫ్లావియా గులియనెల్లీ అనే యువతి ఓ ఈవెంట్ లో పరిచయం అయింది. వారి పరిచయం తొలుత స్నేహంగా, ఆపై ప్రేమగా మారింది. ఒకరికి ఒకరు సరిజోడని తెలుసుకున్న ఆ జంట, ఆదివారం నాడు తమిళనాడులో ఒకటైంది. ఈ పెళ్లికి రెండు కుటుంబాల పెద్దలూ అంగీకరించారు. పెళ్లి తరువాత ఫ్లావియా మాట్లాడుతూ, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, దుస్తులు, కళలు, దేవాలయాలు తనకెంతో నచ్చాయని ఆనందంగా వెల్లడించింది. తానిప్పుడు ధరించిన చీర ఇంకెంతో నచ్చిందని తెలిపింది.

More Telugu News