Maldives: సుప్రీంకోర్టుపై యుద్ధం ప్రకటించిన మాల్దీవ్‌ల అధ్యక్షుడు.. భారత సాయం కోరుతున్న కోర్టు

  • మాల్దీవుల్లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం
  • జైల్లోని రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని సుప్రీం ఆదేశం
  • న్యాయమూర్తులను తొలగించేందుకు అధ్యక్షుడు యత్నం
  • గమనిస్తున్న అంతర్జాతీయ సమాజం

మాల్దీవుల్లో రాజకీయ  సంక్షోభం నెలకొంది. సుప్రీం కోర్టుపై యుద్ధం ప్రకటించిన ఆ దేశాధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ న్యాయమూర్తులను తొలగించేందుకు ప్రయత్నం చేయడం కలకలం రేపుతోంది. చీఫ్ జస్టిస్ అబ్దుల్లా సయీద్ సహా పలువురు న్యాయమూర్తులపై తప్పుడు కేసులు పెట్టి తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్న వేళ సుప్రీంకోర్టు భారత సాయాన్ని అర్ధించింది.

దేశంలో ప్రస్తుతం జరుగుతున్న అవాంఛనీయ ఘటనలను చక్కదిద్దేందుకు భారత సాయం అవసరమని సుప్రీంకోర్టు వర్గాలు పేర్కొన్నాయి. లంచం ఆరోపణలపై చీఫ్ జుడీషియల్ అడ్మినిస్ట్రేషన్ హసన్ సయీద్‌ ఇంటిపై దాడి చేసిన అధికారులు ఇతర న్యాయమూర్తులను బెదిరించారని, ప్రస్తుతం తమకు భారత సాయం అవసరమని ఆ వర్గాలు తెలిపాయి. మాల్దీవుల్లో ప్రస్తుతం  నెలకొన్న సంక్షోభాన్ని భారత్ జాగ్రత్తగా గమనిస్తోంది.

ప్రజలు ఎన్నుకున్న తొలి అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్ సహా జైలులో శిక్ష అనుభవిస్తున్న రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని వారం రోజుల క్రితం సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే జరిగితే తన పదవి కోల్పోవాల్సి వస్తుందని భయపడుతున్న యమీన్ ఏకంగా సుప్రీం న్యాయమూర్తులను తొలగించేందుకు ప్రయత్నించడం సంచలనం సృష్టించింది.

మరోవైపు, తాము కోర్టు ఆదేశాలను పాటించబోమని, అటార్నీ జనరల్ మొహమ్మద్ అనిల్ ఆదేశాలను మాత్రమే పాటిస్తామని సైనిక దళాలు చెప్పడంతో పరిస్థితులు మరింత దిగజారాయి. తమ ఆదేశాలను పాటించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీం మరోమారు ఆదేశాలు జారీ చేసింది. తమ ఆదేశాలను పాటించి రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించడంతో సంక్షోభం మరింత ముదిరింది.

అధ్యక్షుడు యమీన్‌ను తొలగించేందుకు సుప్రీంకోర్టు ప్రయత్నిస్తోందని అటార్నీ జనరల్ ఆరోపించారు. ఇది చట్టవ్యతిరేకమని ఆయన పేర్కొన్నారు. కాగా, యమీన్ మాయమాటలతో అంతర్జాతీయ సమాజాన్ని మోసం చేస్తున్నారని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఆరోపిస్తున్నారు.

More Telugu News