Chandrababu: బీజేపీతో ఇక కటీఫే... సూచనప్రాయంగా తెలిపిన కేశినేని నాని, బుట్టా రేణుక, టీజీ వెంకటేష్

  • ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారన్న బుట్టా రేణుక
  • కలిసుంటే ఏం లాభమన్న టీజీ వెంకటేష్
  • పొత్తుపై చంద్రబాబు ఆలోచిస్తున్నారన్న నాని

భారతీయ జనతా పార్టీతో బంధం నేడు తెగిపోతుందని, ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకోనున్నారని ఆ పార్టీ నేతలు సూచన ప్రాయంగా వెల్లడించారు. వేర్వేరు ప్రాంతాల్లో ఎంపీలు కేశినేని నాని, బుట్టా రేణుక, టీజీ వెంకటేష్ లు మీడియాతో మాట్లాడుతూ, దాదాపు ఒకే విషయాన్ని వెల్లడించడం, బీజేపీ, టీడీపీల మధ్య స్నేహబంధం తెగనుందన్న సంకేతాలను ఇస్తోంది.

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి తీరని అన్యాయం జరిగిందని, ఈ విషయంలో ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారని ఎంపీ బుట్టా రేణుక వ్యాఖ్యానించారు. నేడు జరిగే సమావేశంలో చంద్రబాబునాయుడు కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. మరో ఎంపీ కేశినేని నాని విజయవాడలో మాట్లాడుతూ, ఇప్పటికే తమ అభిప్రాయాలను అధినేతకు చెప్పామని, ఇక బీజేపీతో పొత్తు ఉండాలా? వద్దా? అన్న విషయాన్ని ఆయనే ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని అన్నారు.

రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించడంలో బీజేపీ పాత్ర ఉందని, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మాట తప్పారని, స్పెషల్ ప్యాకేజీ ఊసే లేకుండా చేశారని ఆరోపించిన టీజీ వెంకటేష్, ఇక కలిసుంటే ఏం లాభమని ప్రశ్నించారు. రాష్ట్రానికి లాభం కలిగించని పొత్తు అవసరం లేదని ఇప్పటికే చంద్రబాబుకు స్పష్టం చేసినట్టు వెల్లడించారు.

More Telugu News