Harish Rao: ఆయా రైతులకు తక్షణ అవసరాల కోసం రూ. 2 లక్షల చొప్పున అప్పు సదుపాయం: హరీశ్‌రావు

  • పసుపు రైతులకు రైతుబంధు పథకం
  • జగిత్యాలలో 5 కోట్లతో మామిడికాయల మార్కెట్ అభివృద్ధి
  • ఈ నెల 9 న మార్కెటింగ్, మార్క్ ఫెడ్, హార్టీకల్చర్, అపెడా సంస్థలతో సంయుక్త సమావేశం

పసుపు రైతులకు రైతుబంధు పథకాన్ని విస్తరింపజేయాలని తెలంగాణ మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్ రావు నిర్ణయించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మార్కెటింగ్ కార్యక్రమాలు, ఇరిగేషన్ పథకాలపై మంత్రి హరీశ్ రావు, ఎంపీ కవిత జలసౌధలో అధికారులతో కలిసి సమీక్ష జరిపారు. పసుపు ధర తగ్గినందున ఇబ్బంది పడుతున్న పసుపు రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి ఎంపీ కవిత విజ్ఞప్తి చేశారు.

పసుపు రైతులను ఆదుకునేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని హరీశ్ రావు ఆదేశించారు. రైతుబంధు పథకాన్ని పసుపు రైతులకు కూడా వర్తింపజేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మార్కెట్ యార్డులతో పాటు వాటి వెలుపల ప్రైవేటు కోల్డ్ స్టోరేజ్ లలో పసుపు పంటను నిల్వ చేసుకున్న రైతులకు కూడా రైతుబంధు పథకం అమలు చేయాలని హరీశ్ రావు మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. ఆయా రైతులకు తక్షణ అవసరాలకోసం 2 లక్షల చొప్పున అప్పు సదుపాయం కల్పించాలని కోరారు.

ఆరు నెలల దాకా రైతులు ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత మార్కెట్ లో అమ్ముకోవాలని పసుపు రైతులను హరీశ్ రావు కోరారు. పసుపు రైతుల సమస్యలను అధ్యయనం చేసేందుకు మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేరకు ఆదివారం మార్కెటింగ్ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ నిజామాబాద్ వెళుతున్నారు. ఎంపీ కవిత విజ్ఞప్తి మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలో మామిడికాయల మార్కెట్ ను 5 కోట్లతో అభివృద్ధి పరచాలని మంత్రి ఆదేశించారు.

మామిడి కాయల దిగుబడి, మార్కెటింగ్ క్రయవిక్రయాలకు సంబంధించిన వ్యవహారాలపై కీలక నిర్ణయాలు తీసుకునేందుకు గాను ఈ నెల 9న మార్కెటింగ్, మార్క్ ఫెడ్, హార్టీకల్చర్, అపెడా సంస్థలతో ఒక సమావేశం నిర్వహించాలని మంత్రి హరీశ్ రావు, ఎంపీ కవిత నిర్ణయించారు. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి నివాసంలో ఈ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. కాగా, ఈ నెల 19న బోధన్ నియోజకవర్గంలో పర్యటిస్తానని ఎంపీ కవితకు మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చారు. నిజామాబాద్ పార్లమెంటులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.

నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఇరిగేషన్ పథకాల పురోగతిపై కూడా మంత్రి హరీశ్ రావు, ఎంపీ కవిత సమీక్షించారు. ఈ పార్లమెంటు నియోజకవర్గంలోని లిఫ్ట్ పథకాలు, మైనర్ ఇరిగేషన్ పనులు, చెక్ డ్యాం లు, నిజాంసాగర్ కాలువల ఆధునికీకరణ, కాకతీయ కాలువలకు అదనపు తూముల ఏర్పాటు తదితర పనులను సమీక్షించారు. హైడ్రాలజీ అనుమతులు వచ్చిన వెంటనే నిధుల లభ్యతను బట్టి చెక్ డ్యాం పనులను మంజూరు చేయాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, జాయింట్ డైరెక్టర్ రవికుమార్, ఎస్.ఆర్.ఎస్.పి.చీఫ్ ఇంజనీర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

More Telugu News