uno: భారత్, పాకిస్థాన్ లలో జరుగుతున్న ఈ ఘటనలు హృదయ విదారకం!: ఐక్యరాజ్యసమితి

  • భారత్, పాక్ లలో చిన్నారులపై అత్యాచారాలు
  • ఆవేదన వ్యక్తం చేసిన యూఎన్ఓ
  • ఈ దారుణాలను అరికట్టాలన్న డుజారిక్

అభంశుభం తెలియని చిన్నారులపై లైంగిక దాడులు జరుగుతుండటం పట్ల ఐక్యరాజ్యసమితి ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల ఢిల్లీలో ఎనిమిది నెలల చిన్నారిపై 28 ఏళ్ల ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడన్న వార్తతో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైన సంగతి తెలిసిందే. గత నెలలో ఇలాంటి ఘటనే పాకిస్థాన్ లోనూ చోటు చేసుకుంది. ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిపి, అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన అటు పాకిస్థాన్ ను కుదిపేసింది.

ఈ రెండు ఘటనలపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ అంటానియో గుటెరస్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ స్పందించారు. ఈ రెండు ఘటనల గురించి విన్నప్పుడు తన గుండె పగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్, పాక్ లలో చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులు హృదయ విదారకమని చెప్పారు. ప్రతి దేశంలోనూ ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. ఇలాంటివాటిని అరికట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. మహిళల గౌరవాన్ని కాపాడేందుకు ఐక్యరాజ్యసమితి ఎంతో కృషి చేస్తోందని తెలిపారు.

More Telugu News