KCR: సాగునీటి ప్రాజెక్టులు తొందరగా పూర్తయ్యేలా చూడాలని అమ్మవార్లను కోరుకున్నా: సీఎం కేసీఆర్

  • మేడారం జాతరను సందర్శించిన కేసీఆర్ కుటుంబం
  • రెండు వందల ఎకరాల్లో శాశ్వత ఏర్పాట్లు చేస్తాం
  • జంపన్న వాగుపై మరో డ్యాం నిర్మిస్తాం
  • మేడారం జాతరను జాతీయ పండగగా గుర్తించాలని ప్రధాని మోదీకి విన్నవిస్తా: కేసీఆర్

తెలంగాణలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు తొందరగా పూర్తయ్యేలా చూడాలని, ఎలాంటి ఆటంకాలు కలగొద్దని అమ్మవార్లను కోరుకున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. మేడారం జాతరకు కేసీఆర్ తన కుటుంబసభ్యులతో కలసి ఈరోజు విచ్చేశారు. వనదేవతలను సందర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నాడు అమ్మవార్లను దర్శించుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని కోరుకున్నానని అన్నారు.

తెలంగాణ పోరాట పటిమకు నిదర్శనం సమ్మక్క-సారక్క అని, సమైక్యపాలనలో అన్నీ నిర్లక్ష్యానికి గురైనట్టే ఈ జాతరను కూడా పట్టించుకోలేదని విమర్శించారు. మేడారంలో సదుపాయల నిమిత్తం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని అన్నారు. రెండు వందల ఎకరాల్లో శాశ్వత ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని, జాతరను ఇంకా పటిష్టం చేయాల్సిన అవశ్యకత ఉందని అన్నారు.

ఇందుకు సంబంధించిన భూ సేకరణపై పదిహేను రోజుల్లో మళ్లీ చర్చిస్తామని, జంపన్న వాగుపై మరో డ్యాం నిర్మిస్తామని, భవిష్యత్ లో జరగబోయే మేడారం జాతరను చూసి ప్రపంచం అబ్బురపడేలా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. మేడారం జాతరను జాతీయ పండగగా గుర్తించాలని ప్రధాని నరేంద్ర మోదీకి విన్నవిస్తానని కేసీఆర్ అన్నారు.

More Telugu News