apple iphone slaes: ఐఫోన్ల అమ్మకాలు తగ్గినా... లాభాల్లో రికార్డులు తిరగరాసిన యాపిల్

  • డిసెంబర్ త్రైమాసికంలో రూ.1.28 లక్షల కోట్ల లాభం
  • ఒక త్రైమాసికంలో అత్యధిక లాభంగా రికార్డు
  • ఆదాయం రూ.5.65 లక్షల కోట్లు
  • అమ్మకాలు మాత్రం ఒక శాతం తగ్గుదల

యాపిల్ లాభాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఓ త్రైమాసిక కాలంలో (క్వార్టర్) భారీ లాభాలను నమోదు చేసింది. 2017 ఏడాది చివరి క్వార్టర్ (అక్టోబర్ - డిసెంబర్)లో 20.1 బిలియన్ డాలర్ల లాభాన్ని ఆర్జించింది. దీంతో రెండేళ్ల క్రితం లాభాల పరంగా తాను నమోదు చేసిన రికార్డును మరోసారి తిరగరాసింది. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే 1.28 లక్షల కోట్ల లాభాలు వచ్చినట్టు. లాభాలకు ప్రధానంగా గత నవంబర్ లో విడుదల చేసిన ఐఫోన్ ఎక్స్ తోడ్పడింది. అలాగే, గత సెప్టెంబర్ లో విడుదల చేసిన ఐఫోన్ 8 కూడా లాభాలకు కారణమైంది.

అయితే, అమ్మకాలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే గడిచిన డిసెంబర్ క్వార్టర్ లో ఒక శాతం అమ్మకాలు తగ్గాయి. 7.7 కోట్ల ఐఫోన్లను సంస్థ విక్రయించింది. కొత్తగా విడుదల చేసిన ఫోన్ల ధరలు అధిక స్థాయిలో ఉండడంతో లాభాల యాత్ర కొనసాగింది. అమ్మకాల ద్వారా ఆదాయం మాత్రం 13 శాతం అధికంగా 88.3 బిలియన్ డాలర్లు (రూ.5.65 లక్షల కోట్లు)గా నమోదైంది. ఐఫోన్ ఎక్స్ తమ అంచనాలను అధిగమించిందని, నవంబర్ నుంచి ఇది ప్రతీ వారం అత్యధికంగా విక్రయమవుతున్న మోడల్ గా ఉందని యాపిల్ సీఈవో టిమ్ కుక్ అన్నారు. 

More Telugu News