Kakinada: జేఎన్టీయూ (కె) విద్యార్థినులకు మార్కులు ఆశ చూపే కామాంధుడు... సహకరించాలని కోరే కీచకుడు అరెస్ట్!

  • సహకరిస్తే ఫుల్ మార్కులు వేస్తాననే ప్రొఫెసర్
  • 23 మంది అమ్మాయిలకు లైంగిక వేధింపులు
  • అరెస్ట్ చేసిన పోలీసులు

'నేను సహకరిస్తే నీకు ఫుల్ మార్కులు వస్తాయి. నా చేతుల్లో ఉన్న స్పెషలైజేషన్ తీసుకో. పీజీ పరీక్షల్లో పాస్ చేయిస్తాను. అయితే నాకు కూడా నువ్వు సహకరించాలి. నా ఫోన్ నంబర్ తీసుకుని ఒంటరిగా వచ్చెయ్...' ఇలా సాగుతాయి ఆ కీచక ప్రొఫెసర్ వేధింపు మాటలు. కొంతమందిని లైంగికంగా వేధించాడు కూడా. కాకినాడ జేఎన్టీయూలో ఎంటెక్ మొదటి సంవత్సరం చదివే అమ్మాయిలే అతని టార్గెట్. విద్యార్థినుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన పోలీసులు, జేఎన్టీయూలో ప్రొఫెసర్ గా పని చేస్తున్న కే బాబులును అరెస్ట్ చేశారు.

వైవా సమయంలో చెప్పరాని చోట్ల తాకుతూ తనను వేధించాడని గత నెల 30న ఓ ఎంటెక్ తొలి సంవత్సరం చదువుతున్న యువతి ఫిర్యాదుతో కేసు నమోదు కాగా, ఆపై విచారణలో పోలీసులు విస్తుపోయే నిజాలు తెలిశాయి. మొత్తం 23 మందిని ప్రొఫెసర్ వేధించాడని తేలింది. తనను వ్యక్తిగతంగా వచ్చి కలవాలని అడిగేవాడని, పర్సనల్ విషయాలు చెప్పాలంటూ, సందర్భం లేకున్నా తాకుతూ పైశాచికానందాన్ని పొందేవాడని అమ్మాయిలు ఫిర్యాదు చేశారు.

శారీరకంగానూ అవమానించాడని, మాటలు, చేతలతో వేదనకు గురి చేశాడని పోలీసులకు చెప్పారు. దీంతో కేసును సీరియస్ గా తీసుకున్న కాకినాడ డీఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు బాబులును అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పరిచారు. లైంగిక వేధింపులను చాలా సీరియస్ గా తీసుకుంటామని, బాధితుల వివరాలు బయటకు రానీయకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు.

More Telugu News