amith shah: బడ్జెట్ లో లేకున్నా అమరావతికి నిధులిచ్చాం...కావాలంటే ఇంకా ఇస్తాం: అమిత్ షా

  • ఏపీకి నిధులిచ్చేందుకు సిద్ధం
  • డీపీఆర్ ఇవ్వనప్పటికీ 2,000 కోట్లు ఇచ్చాం..ఇంకా ఇస్తాం
  • బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చెయ్యండి

ఏపీకి ఇంకా నిధులిచ్చేందుకు సిద్ధమని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆ పార్టీ ఎంపీలతో గంటన్నరపాటు సమావేశమై కీలక అంశాలపై చర్చించిన సందర్భంగా, బడ్జెట్ అంటే కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదని, దేశం మొత్తానికి ఉద్దేశించినదని తెలిపారు. ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి సరైన డీపీఆర్ రాష్ట్ర ప్రభుత్వం అందించలేదని ఆయన తెలిపారు.

అయినప్పటికీ అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 2 వేల కోట్ల సహాయం అందించిందని ఆయన వెల్లడించారు. అమరావతి అభివృద్ధికి ఇంకా నిధులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. బూత్‌ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని, కేంద్రంపై టీడీపీ చేస్తున్న విమర్శలకు జవాబివ్వాలని ఆయన సూచించారు.

రాష్ట్రానికి మోదీ సర్కారు చేస్తున్న సహాయం గురించి ప్రజలకు వివరించాలని ఆయన చెప్పారు. గతంలో తాను రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెంలలో పర్యటించానని ఈసారి రాయలసీమలో పర్యటిస్తానని ఆయన వారికి చెప్పినట్టు తెలుస్తోంది. ఈ లోగా బూత్ స్థాయిలో వీలైనంతమంది కార్యకర్తలను తయారు చేయాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. 

More Telugu News