HAL: వాయుసేనకు మరో అస్త్రం... ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టమ్ తో తొలిసారి ఎగిరిన యుద్ధ హెలికాప్టర్!

  • హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అభివృద్ధి చేసిన చాపర్
  • 5.8 టన్నుల బరువుండే యుద్ధ హెలికాప్టర్
  • స్వీయ నియంత్రణా వ్యవస్థతో దాడులు చేసే సామర్థ్యం

భారత వాయుసేన అమ్ముల పొదిలోకి మరో అత్యాధునిక అస్త్రం వచ్చి చేరింది. ప్రభుత్వ రంగ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) తయారు చేసిన 5.8 టన్నుల బరువైన దేశవాళీ తేలికపాటి యుద్ధ హెలికాప్టర్, తన స్వీయ ఆటోమేటిక్ ఫ్లయిట్ నియంత్రణా వ్యవస్థ సాయంతో తొలిసారిగా ఎగిరింది. దాదాపు 20 నిమిషాల పాటు ఈ మల్టీరోల్ చాపర్ విజయవంతంగా ఆటోమేటిక్ విధానంలో ఎగిరిందని హెచ్ఏఎల్ చైర్మన్ టీ సువర్ణ రాజు ఓ ప్రకటనలో తెలిపారు.

 హెచ్ఏఎల్ చీఫ్ టెస్ట్ పైలట్ వింగ్ కమాండర్ గా గతంలో పనిచేసి పదవీ విరమణ చేసిన ఉన్ని కే పిళ్లై, టెస్ట్ పైలట్ గ్రూప్ కెప్టెన్ రాజేష్ వర్మలు ఈ హెలికాప్టర్ లో కూర్చుని ఆటోమేటిక్ వ్యవస్థ పనితీరును పరిశీలించారని, నగరంలోని తూర్పు ప్రాంతంలో ఉన్న రక్షణ శాఖ ఎయిర్ పోర్టుపై నుంచి ఇది ఎగిరిందని తెలిపారు. భారత వాయుసేనకు ఈ తరహా హెలికాప్టర్లను మొత్తం 15 అందించనున్నామని ఆయన అన్నారు.

సముద్ర మట్టానికి 5,400 మీటర్ల ఎత్తులో ఉండే సియాచిన్ తదితర ప్రాంతాల్లోనూ ఈ చాపర్లు సమర్థవంతంగా పని చేస్తాయని చెప్పారు. రాత్రి పూటయినా, పగటి పూటయినా లక్ష్యాలను ఇది టార్గెట్ చేసే వ్యవస్థ ఉంటుందని వెల్లడించారు. ఏ రకమైన వాతావరణంలోనైనా టేకాఫ్, ల్యాండింగ్ తీసుకుంటుందని, ఇద్దరు ఇందులో ప్రయాణిస్తూ, శత్రు స్థావరాలపై బాంబులను కురిపించి రావచ్చని సువర్ణ రాజు వెల్లడించారు. దాడులు చేసే వ్యవస్థను కూడా ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టమ్ స్వయంగా నిర్వహించే వీలుందని తెలిపారు. కాగా, ఈ తరహా హెలికాప్టర్ల కోసం మార్చి 2016లో చర్చలు ప్రారంభం కాగా, గత సంవత్సరం ఆగస్టులో కేంద్రం నుంచి క్లియరెన్స్ అందిన తరువాత హెచ్ఏఎల్ పని ప్రారంభించింది.

More Telugu News