Nara Lokesh: ఏపీతో కలిసి పనిచేస్తామన్న గూగుల్.. ఫేస్‌బుక్.. ఫలిస్తున్న మంత్రి లోకేశ్ పర్యటన!

  • ఏపీలో కంపెనీల ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసిన దిగ్గజ కంపెనీలు
  • ఏపీలో పైలట్ ప్రాజెక్టులు చేపడతామన్న ఫేస్‌బుక్
  • రియల్‌టైమ్ గవర్నెన్స్‌లో అనలిటిక్స్ సేవలు అందిస్తామన్న గూగుల్

నవ్యాంధ్రప్రదేశ్‌తో కలిసి పనిచేసేందుకు గూగుల్, ఫేస్‌బుక్ ముందుకొచ్చాయి. వివిధ రంగాల్లో ఏపీతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గూగుల్ పేర్కొనగా, తాము అభివృద్ధి చేస్తున్న టెక్నాలజీపై ఏపీలో పైలట్ ప్రాజెక్టులు చేపట్టేందుకు రెడీగా ఉన్నట్టు ఫేస్‌బుక్ తెలిపింది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ  ఐటీ మంత్రి నారా లోకేశ్ బుధవారం శాన్‌ఫ్రాన్సిస్కోలో గూగుల్, ఫేస్‌బుక్ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు.

గూగుల్ డేటా సెంటర్ బృందం పార్థసారథి, రామ్, యాస్పీతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఏపీతో కలిసి పనిచేసేందుకు గూగుల్ సంసిద్ధత వ్యక్తం చేసింది. రియల్ టైమ్ గవర్నెన్స్‌లో అనలిటిక్స్ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్న గూగుల్, త్వరలోనే ఏపీకి ఓ బృందాన్ని పంపించి అధ్యయనం చేస్తామని పేర్కొంది.

ఫేస్‌బుక్ సంస్థ ప్రతినిధులతో భేటీ సందర్భంగా వారి సహకారం కావాలని లోకేశ్ కోరారు. ఫేస్‌బుక్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన లోకేశ్‌కు ఆ సంస్థ సిబ్బంది పలు విషయాల గురించి మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ ఏపీలోని గ్రామీణులు తయారుచేసే ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లేందుకు పేస్‌బుక్ సహకారం కావాలని కోరారు. స్పందించిన ఫేస్‌బుక్ త్వరలోనే ఏపీలో పైలట్ ప్రాజెక్టులు చేపడతామని హామీ ఇచ్చింది.

More Telugu News