ntr: అమరావతిలో అక్టోబర్ నాటికి హైకోర్టు భవనాలు సిద్ధం: మంత్రి నారాయణ

  • ఏప్రిల్ 11, 12 తేదీల్లో సిటీ సమ్మిట్
  • అమరావతిలో ఐటీ టవర్ నిర్మాణం: నారాయణ
  • రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు  
  • మే, జూన్ లో ‘అన్న’ క్యాంటీన్లు ప్రారంభం: మంత్రి ప్రత్తిపాటి 

ఈ ఏడాది అక్టోబర్ నాటికి అమరావతిలో హైకోర్టు భవనాలు అందుబాటులోకి రానున్నాయని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. ఏపీ సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి ఆయన మాట్లాడారు.

రూ.110 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణ పనులు ఫిబ్రవరి ఆఖరులోగాని, మార్చి మొదటి వారంలో గాని ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం ఈరోజు జరిగిందని, ఈ సమావేశంలో హైకోర్టు భవన నిర్మాణం, తరలింపుపై ప్రధాన చర్చ జరిగినట్లు తెలిపారు. నాలుగు ఎకరాల్లో జీ ప్లస్ 2 పద్ధతిలో రూ.110 కోట్లతో హైకోర్టు భవన సముదాయాలు నిర్మించనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం హైకోర్టు భవనాల డిజైన్లు తుది దశలో ఉన్నాయని, ఈ డిజైన్లను హైకోర్టు న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళతామని, ఫిబ్రవరి ఆఖరులోగాని, మార్చి మొదటి వారంలోగాని హైకోర్టు భవన నిర్మాణ పనులు ప్రారంభిస్తామని, శాశ్వత పద్ధతిలోనే భవన నిర్మాణ పనులు చేపడతామని, అక్టోబర్ నాటికి హైకోర్టు భవనాలు పూర్తికానున్నట్టు తెలిపారు.

ఏప్రిల్ 12, 13 తేదీల్లో సిటీ సమ్మిట్


విజయవాడలో ఏప్రిల్ 12, 13 తేదీల్లో సిటీ సమ్మిట్ నిర్వహించనున్నామని, పలు దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సమ్మిట్ లో పాల్గొననున్నట్టు చెప్పారు. ఈ రోజు జరిగిన సీఆర్డీఏ సమావేశంలో సిటీ సమ్మిట్ నిర్వహణపై అధికారులకు చంద్రబాబునాయుడు దిశా నిర్దేశం చేశారని, సమ్మిట్ నిర్వహణకు సంబంధించి లోగో, థీమ్ పై చర్చ జరిగిందని పేర్కొన్నారు. ఈ సమ్మిట్ కు విజయవాడలో పలు ప్రాంతాలను పరిశీలిస్తున్నామని, శాంతి భద్రతలు, రవాణా సదుపాయాల దృష్ట్యా భవానీ ఐల్యాండ్ లో సిటీ సమ్మిట్ నిర్వహణపై ప్రభుత్వం మొగ్గు చూపుతోందని తెలిపారు.

అమరావతిలో ఐటీ టవర్

అమరావతిలో ఐటీ టవర్ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలో వసతి సౌకర్యం కల్పిస్తే, ఐటీ పరిశ్రమలు స్థాపించడానికి అమెరికాకు చెందిన ఐటీ పారిశ్రామిక వేత్తలు ముందుకొచ్చారని, దీనిని దృష్టిలో పెట్టుకుని, సీఎం చంద్రబాబునాయుడు 10 లక్షల చదరపు అడుగుల నిర్మాణంలో రెండు భవనాలు నిర్మించాలని నిర్ణయించారని అన్నారు. దీనిపై సమగ్రమైన వివరాలు అందించాలని సీఆర్డీఏ అధికారులను చంద్రబాబు ఆదేశించారని తెలిపారు.

ఎన్టీఆర్ భారీ విగ్రహ డిజైన్లు సిద్ధం

నీరుకొండపై ఏర్పాటు చేయదలచిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ భారీ విగ్రహానికి సంబంధించిన డిజైన్లు సిద్ధమైనట్టు నారాయణ తెలిపారు. ఈ శుక్రవారం జరగనున్న కేబినెట్ భేటీలో దీనిపై చర్చించి, ప్రజాభిప్రాయ సేకరణకు ఆన్ లైన్ లో పెట్టనున్నట్టు చెప్పారు. మార్చి నుంచి ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని, విజయవాడలో ఏర్పాటు చేయదలచిన గాంధీ పార్కు డిజైన్లను సీఆర్డీఏ సమావేశంలో ఆమోదించినట్లు తెలిపారు.

ప్రతి ఇంటికీ తాగునీటి కనెక్షన్...

పట్టణాల్లో ఉన్న ప్రతి ఇంటికీ తాగునీటి కనెక్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు నారాయణ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 110 మున్సిపల్ శివారు ప్రాంతాల్లో ఉన్న కాలనీల్లో రోడ్లు, కాలువల నిర్మాణం కూడా చేపట్టనున్నామని, కాలువల్లో మురుగు నీటిని శుద్ధి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, కాలువలు, రోడ్లు, మురుగునీటి శుద్ధి కోసం రూ.11 వేల కోట్లు వ్యయమయ్యే అవకాశముందని, పూర్తి స్థాయి ప్రణాళికలు అందజేయాలని సంబంధిత అధికారులను చంద్రబాబునాయుడు ఆదేశించినట్టు చెప్పారు.

నిరుపేదలకు ఉచితంగా ఇళ్లు

రాష్ట్రంలో నిరుపేదలకు ఉచితంగా ఇళ్ల నిర్మాణలు చేపట్టి అందజేయాలని ప్రభుత్వం భావిస్తోందని, రైలు పట్టాలు, పట్టణాలకు దూరంగా పూరిపాకల్లో ఉండే వారి కోసం అపార్టుమెంట్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించినట్టు నారాయణ తెలిపారు. 203 చదరపు అడుగుల్లో రూ.4.60 లక్షలతో ఇళ్లను నిర్మించనున్నామని, వీటిలో రూ.4 లక్షలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించగా, మిగిలిన రూ.60 వేలు బ్యాంకుల నుంచి ఇప్పిస్తామని, ఈ అరవై వేల రూపాయలను నామమాత్రంగా నెలవారీ చెల్లించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణంపై సీఆర్డీయే సమావేశంలో చర్చించామని, శుక్రవారం జరిగే రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పారు.

మే, జూన్ లో ‘అన్న’ క్యాంటీన్లు ప్రారంభం: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు


రాష్ట్రంలోని 65 మున్సిపాల్టీల్లో 200 అన్న క్యాంటీన్లను మే లో గాని, జూన్ లో గాని ఒకేసారి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సివిల్ సప్లయ్ ఆధ్వర్యంలో ప్రారంభించనున్న ఈ క్యాంటీన్లను మున్సిపల్ శాఖ పర్యవేక్షించనుందని, ‘అక్షయపాత్ర’ వంటి స్వచ్ఛంద సంస్థలకు ‘అన్న’ క్యాంటీన్లలో భోజన సదుపాయం అందించే బాధ్యతలు అప్పగించనున్నట్టు చెప్పారు. కూలీలకు, పట్టణాలకు వచ్చే రైతులకు ‘అన్న’ క్యాంటీన్ల ద్వారా తక్కువ ధరకు మంచి భోజన సదుపాయం లభ్యమవుతుందని, ఈ క్యాంటీన్లతో పాటు మొదటి విడతగా 6 వేలకు పైగా విలేజ్ మాల్స్ ను కూడా ఒకేసారి ప్రారంభించనున్నట్టు చెప్పారు.
రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేసే మిల్లర్లపై కఠిన చర్యలు

కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)కు అందజేసే రేషన్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రత్తిపాటి పుల్లరావు హెచ్చరించారు. రైస్ మిల్లులో రీసైక్లింగ్ ను అడ్డుకోడానికి విద్యుత్ వాడకాన్ని పరిగణలోకి తీసుకుంటామని, పీడీఎస్ బియాన్ని రీ సైక్లింగ్ చేసే మిల్లర్లకు పేమెంట్ నిలిపేయడమే కాకుండా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, పీడీఎస్ బియ్యం రీ సైక్లింగ్ చేయకూడదని పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల రైస్ మిల్లర్ల సంఘాలు తీర్మానం చేశాయని చెప్పారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల మిల్లర్లు ఇటువంటి నిర్ణయం తీసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. థియేటర్ల ఎంఆర్పీ కంటే అధికంగా విక్రయించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే ఆయా థియేటర్ల లైసెన్లను కూడా రద్దు చేయడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు. జనవరి 1 నుంచి డబుల్ ఎంఆర్పీ ధరలు ఉండడానికి వీల్లేదని హెచ్చరించారు.

30 లక్షల 10 వేల టన్నుల ధాన్యం కొనుగోలు

రాష్ట్రంలో ఇప్పటి వరకూ 30 లక్షల 10 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఖరీఫ్ కు సంబంధించి 43 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, రైతులకు 48 గంటల్లో పేమెంట్ చెల్లిస్తున్నామని, జిల్లాను యూనిట్ గా చేసుకుని రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తోందని చెప్పారు. దీనివల్ల జిల్లాలో ఎక్కడైనా ధాన్యం అమ్ముకునే అవకాశం రైతులకు కలుగుతుందని, రైతులకు మద్దతు ధర అందించాలనేది సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యమని అన్నారు. రబీలో కూడా ఇదే పద్ధతిలో ధాన్యం కొనుగోలు చేయనున్నట్టు చెప్పారు.

More Telugu News