google: పూణే 150 వై-ఫై హాట్‌స్పాట్‌లు ఏర్పాటు చేసిన గూగుల్‌

  • గూగుల్ స్టేష‌న్స్ పేరుతో నిర్వ‌హ‌ణ‌
  • ఎల్ అండ్ టీ సౌజ‌న్యంతో ప్రాజెక్టు
  • త్వ‌ర‌లో దేశ‌వ్యాప్తం చేసే అవ‌కాశం

లార్సెన్ అండ్ ట‌ర్బో (ఎల్ అండ్ టీ) సంస్థ‌తో క‌లిసి పూణే వ్యాప్తంగా 150 వైఫై హాట్‌స్పాట్‌ల‌ను గూగుల్ సంస్థ ఏర్పాటు చేసింది. ఇప్ప‌టికే రైల్‌టెల్ వై-ఫై ప్రాజెక్టు పేరుతో దేశ‌వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేష‌న్ల‌లో వై-ఫై హాట్‌స్పాట్ల‌ను గూగుల్ ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అదే బాట‌లో రైల్వే స్టేష‌న్ బ‌య‌ట కూడా వై-ఫై స‌దుపాయం అంద‌జేయాల‌న్న ఉద్దేశంతో ఈ హాట్‌స్పాట్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు తెలుస్తోంది.

పూణే స్మార్ట్‌సిటీ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పోరేష‌న్ లిమిటెడ్ వారి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఈ హాట్‌స్పాట్‌లు ఏర్పాటు చేశారు. గూగుల్ స్టేష‌న్స్ పేరుతో వీటిని నిర్వ‌హించ‌నున్న‌ట్లు సంస్థ ప్ర‌తినిధి విన‌య్ గోయ‌ల్ తెలిపారు. ఈ హాట్‌స్పాట్ల ద్వారా 3 మిలియ‌న్ల మంది పూణే వాసుల‌కు వై-ఫై అందుబాటులోకి వ‌చ్చింద‌ని అన్నారు. న‌గ‌ర‌వ్యాప్తంగా ఉన్న ప‌బ్లిక్ గార్డెన్లు, ఆసుప‌త్రులు, పోలీసు స్టేష‌న్ల ప‌రిధిలో ఈ వై-ఫై హాట్‌స్పాట్‌ల‌ను ఏర్పాటు చేశారు. త్వ‌ర‌లోనే దేశంలో ఉన్న ఇత‌ర స్మార్ట్‌సిటీల‌కు కూడా ఈ సౌక‌ర్యాన్నే విస్త‌రించే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

More Telugu News