oman: మస్కట్ తీసుకున్న నిర్ణయంతో తెలుగువారి ఆశలు ఆవిరి!

  • 87 రకాల ఉద్యోగ వీసాలు నిలిపివేత
  • స్థానికులకే ఎక్కువ ఉద్యోగాలు
  • తెలుగు రాష్ట్రాల యువతకు షాక్

ఐటీ, ఇంజినీరింగ్, మెడికల్, మార్కెటింగ్ ఇలా ఎన్నో రకాల ఉద్యోగాల కోసం లక్షలాది మంది గల్ఫ్ దేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తుంటారు. మెరుగైన వేతనం కోసం వీరంతా ఎడారి దేశాలకు క్యూ కడుతుంటారు. ఇలాంటి దేశాల్లో ఒమన్ (రాజధాని మస్కట్) కూడా ఒకటి. తాజాగా ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పైన పేర్కొన్న ఉద్యోగాలతో పాటు 87 రకాల ఉద్యోగ వీసాలను ఆపేసింది. ఆరు నెలల పాటు ఈ నిషేధం కొనసాగనుంది. గత ఆదివారం నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. స్వదేశంలో నిరుద్యోగం పెరుగుతుండటం, విదేశాల నుంచి వలసలు ఎక్కువ కావడమే ఈ నిషేధానికి కారణం.

ఒమన్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఎక్కువ ప్రభావం ఇరు తెలుగు రాష్ట్రాలపై పడింది. ఏపీ, తెలంగాణకు చెందిన లక్షలాది మంది గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. ఒమన్ సంపన్న దేశం కావడం, పర్యాటక పరంగా కూడా ఎక్కువ టూరిస్టులను ఆకర్షిస్తుండటంతో అక్కడ ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఏపీ, తెలంగాణ యువత గత పదేళ్లుగా ఈ దేశానికి క్యూ కట్టింది. విదేశాల నుంచి వలసలు పెరగడంతో... అక్కడ ఉన్నతశ్రేణి ఉద్యోగాలకు కూడా డిమాండ్ పెరిగింది. దీంతో, స్థానికులకు ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారింది.

ఈ నేపథ్యంలో, కీలకమైన ఉద్యోగాలు స్థానికులకే చెందాలంటూ అక్కడి యువత డిమాండ్ చేయడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే, కీలక ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఒమన్ ప్రభుత్వం నిర్ణయించింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా... అన్ని సంస్థల్లో ఎక్కువ శాతం స్వదేశీయులే ఉండేలా నిబంధనలు రూపొందించింది. పది మంది పని చేసే చిన్న హోటల్ లో కూడా కనీసం ఆరుగురు స్వదేశస్తులు ఉంటేనే అనుమతులు ఇస్తోంది.

వీసాలు నిషేధించిన రంగాలు ఇవే:
మెడికల్, మార్కెటింగ్, సేల్స్, హెచ్ఆర్, ఇన్స్యూరెన్స్, ఎయిర్ పోర్ట్, ఇంజినీరింగ్, టెక్నికల్, ఐటీ, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, మీడియా రంగాల్లోన్ని 87 రకాల ఉద్యోగాలు. ఈ నిషేధాన్ని పొడిగించే అవకాశం కూడా ఉంది. 

More Telugu News