Telangana: పాసుపుస్తకాలను తిరిగి రైతులకు వాపస్ చేయండి: బ్యాంకర్లకు మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి

  • ‘2018-19’ రాష్ట్ర రుణ విధానపత్రం విడుదల చేసిన మంత్రి
  • సీఎం కేసీఆర్ కృషి వల్ల భూ రికార్డుల ప్రక్షాళన
  •  స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ కింద పంట రుణాలు ఇవ్వాలి
  • కోల్డ్ స్టోరేజ్ లకు నాబార్డు రుణాలు ఇవ్వాలన్న హరీష్ రావు

బ్యాంకర్లు తమ వద్ద ఉంచుకున్న పాసుపుస్తకాలను తిరిగి రైతులకు వాపస్ చేయాలని తెలంగాణ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖా మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. నాబార్డు రూపొందించిన ‘2018-19’ రాష్ట్ర రుణ విధానపత్రాన్ని హరీష్ రావు ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందు చూపుతో దాదాపు 8 దశాబ్దాలుగా జరగని భూముల రికార్డులను సంపూర్ణంగా ప్రక్షాళన చేశారని ప్రశంసించారు.

రైతులు పంట రుణాలు తీసుకోవడానికి వారి పాసు పుస్తకాలు అవసరం లేదని,వారికి సంబంధించిన పూర్తి సమాచారం ఆన్‌లైన్లో అందుబాటులో ఉందని చెప్పారు. వెరిఫికేషన్‌ పేరిట రైతుల నుంచి తీసుకున్నాయన్నారు. కానీ వాటిని ఇప్పటికీ వెనక్కు ఇవ్వలేదని మంత్రి చెప్పారు. తిరిగి వెనక్కి ఇచ్చేలా  బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేయాలని నాబార్డు అధికారులను ఆయన కోరారు. రైతులకు మే–జూన్‌ నెలల్లోనే పంట రుణాలు అందజేయాలని కోరారు. ప్రభుత్వం ఎకరానికి 4 వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందజేస్తున్నట్టు మంత్రి గుర్తు చేశారు. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం పంట రుణాలు ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేసిన ఆయన, కోల్డ్‌ స్టోరేజీలకు నాబార్డు రుణం అందజేయాలని కోరారు. మిషన్ కాకతీయ కార్యక్రమంతో అద్భుతమైన పంట దిగుబడి వస్తోందని, పూడికతీత మట్టితో దిగుబడి గణనీయంగా పెరిగిందని అన్నారు.

 తెలంగాణ ప్రభుత్వం ముమ్మాటికీ రైతు సంక్షేమ ప్రభుత్వమని, నాబార్డు కూడా తెలంగాణ రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా సహకరించాలని హరీష్ రావు కోరారు. మిషన్ కాకతీయ కార్యక్రమం అమలుపై నాబార్డ్ కు చెందిన 'నాబ్కాన్' సంస్థ అధ్యయన నివేదికను తాను కేంద్ర జలవనరుల మంత్రి గడ్కరీకి కూడా ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ మార్కెటింగ్ రంగంలో గోడౌన్ల నిర్మాణానికి గాను 1000 కోట్ల ఆర్ధిక తోడ్పాటు అందించిన నాబార్డుకు సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

More Telugu News