Bahubali: 'బాహుబలి'కి ఇంత విజయం ఎలా?... తేల్చేందుకు కదలనున్న అహ్మదాబాద్ ఐఐఎం!

  • బాహుబలిపై సునిశిత అధ్యయనం
  • రెండో సంవత్సరం విద్యార్థులకు 'మేనేజ్ మెంట్' పాఠం
  • నాలుగు నెలల్లో పూర్తి కానున్న స్టడీ

ప్రపంచ సినీ ఇండస్ట్రీలో ఓ ఇండియన్ సినిమాగా విడుదలై, సంచలన విజయం సాధించిన 'బాహుబలి' ఘన విజయం వెనుక కారణాలపై సునిశిత అధ్యయనం చేపట్టేందుకు అహ్మదాబాద్‌ ఐఐఎం కదిలింది. సినిమా కథ, దర్శకత్వం, గ్రాఫిక్స్, సంగీతంతో పాటు సినిమా ప్రమోషన్ కు చిత్ర నిర్మాతలు అవలంబించిన విధానాలపై కూడా స్టడీ చేయాలని నిర్ణయించారు.

సినిమా సూపర్ హిట్ అవడానికి తోడ్పడిన అంశాలపై స్టడీ చేయాలని గెస్ట్ ప్రొఫెసర్ గా ఉన్న భరతన్ కందస్వామి సంకల్పించగా, ఆయనకు పూర్వ విద్యార్థులు కూడా తోడయ్యారు. ఐఐఎం సెకండ్ ఇయర్ విద్యార్థులకు మేనేజ్‌ మెంట్‌ విభాగంలో ప్రత్యేక అంశంగా బాహుబలి ఘనవిజయాన్ని చేర్చాలని నిర్ణయించారు. దీంతో ఈ అంశంపై విద్యార్థులు లోతైన అధ్యయనం చేసే అవకాశం లభిస్తుంది. నాలుగునెలల్లో ఈ స్టడీ పూర్తి కానుందని ఐఐఎం వర్గాలు వెల్లడించాయి.

ఇదో గొప్ప చిత్రమని, కళ, సాంకేతిక పరిజ్ఞానాలకు వ్యాపారం కూడా తోడైందని ఈ సందర్భంగా భరతన్ కందస్వామి వ్యాఖ్యానించారు. సృజనాత్మకంగా, కళాత్మకంగా ఉండే సినిమాలు మంచి కలెక్షన్లు రాబట్టలేకపోవచ్చని, కొన్నిసార్లు టెక్నాలజీని వాడినా ఉపయోగం ఉండదని గుర్తు చేసిన ఆయన, కథ బాగున్నంత మాత్రాన సినిమా హిట్ కావాలని లేదని, కథ మోస్తరుగా ఉన్న చిత్రాలూ హిట్ అయిన సందర్భాలుంటాయని చెప్పారు. కానీ బాహుబలి విషయంలో అన్నీ కుదిరాయని, అందుకే అంత విజయాన్ని నమోదు చేసిందని తెలిపారు.

More Telugu News