Bihar: జమిలీ ఎన్నికలు: నరేంద్ర మోదీ ఆశలపై నీళ్లు చల్లుతున్న బీహార్ సీఎం నితీశ్ కుమార్!

  • జమిలీ ఎన్నికలు సాధ్యం కావు
  • గుజరాత్, కర్ణాటక ఎలా వస్తాయి?
  • జేడీ-యూ సమావేశంలో నితీశ్ వ్యాఖ్యలు
  • బీహార్ కు 2020లోనే ఎన్నికలన్న సీఎం

దేశవ్యాప్తంగా పార్లమెంట్ కు, అన్ని రాష్ట్రాలకూ ఒకేసారి ఎన్నికలు జరిపించాలన్న నరేంద్ర మోదీ ఆశయానికి సొంత కూటమి కీలక నేతల నుంచే మద్దతు కరవైంది. వచ్చే సంవత్సరం జమిలీ ఎన్నికలు సాధ్యం కానేకాదని బీహార్ ముఖ్యమంత్రి, ఎన్టీయే కూటమి నేత నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. గుజరాత్, కర్ణాటక వంటి రాష్ట్రాలపై భారాన్ని వేస్తాయని కూడా అన్నారు. చాలా రాష్ట్రాలు జమిలీ ఎన్నికలకు అంగీకరించబోవని అభిప్రాయపడ్డారు.

గత సంవత్సరం బీహార్ లో మహాకూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీతో జట్టు కట్టిన నితీశ్ కుమార్, ఇలా మోదీ ఆశయంగా భావిస్తున్న సంస్కరణకు అడ్డుపడటం ఇదే తొలిసారి. కాగా, నితీశ్ వ్యాఖ్యలు అధికారపక్షంలోనే విపక్షం ఉందని గుర్తు చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. అన్ని రాష్ట్రాలకూ, కేంద్రానికీ ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని, కనీసం ఐదేళ్ల పాటు ఎన్నికల వాతావరణం కనిపించదన్నది మోదీ అభిప్రాయం.

పాట్నాలో జరిగిన జేడీ-యూ అంతర్గత సమావేశంలో నితీశ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. బీహార్ ఎన్నికలు 2020 అక్టోబర్ - నవంబర్ లోనే జరుగుతాయని, వచ్చే సంవత్సరం అసెంబ్లీని రద్దు చేసి పార్లమెంట్ ఎన్నికలతో పాటే రాష్ట్ర ఎన్నికలు జరుగుతాయని వస్తున్న వార్తలు అవాస్తవమని ఆయన కొట్టి పడేశారు. కాగా, దాణా కుంభకోణంలో నితీశ్ ప్రత్యర్థి లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలి, జైలుకు వెళ్లిన తరువాత జమిలీ ఎన్నికలకు బీహార్ కూడా సిద్ధమైనట్టు కనిపిస్తోందని విశ్లేషణలు వచ్చాయి. ఇటీవలే గుజరాత్ ఎన్నికలు ముగిశాయని, కర్ణాటకలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయని గుర్తు చేసిన నితీశ్, ఈ రెండు రాష్ట్రాలూ ఏడాదిలోనే మరోసారి ఎన్నికలకు సిద్ధమవుతాయని ఎలా భావిస్తారని కూడా నితీశ్ ప్రశ్నించడం గమనార్హం.

More Telugu News