Rajamouli: దర్శకుడు రాజమౌళి దాతృత్వం.. ఊపిరి పోసుకున్న విద్యాలయం!

  • విశాఖలో నాటి హుదుహుద్ తుపానుకు దెబ్బతిన్న పాఠశాల
  • కొత్త గదుల నిర్మాణానికి ఆర్థిక సాయం చేసిన రాజమౌళి, ఎంఎం కీరవాణి, శోభనాద్రి, ప్రశాంతి
  • పూర్తయిన కొత్త భవనం
  • ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు

ఏపీలో 2014లో వచ్చిన హుదుహుద్ తుపాను ఎంతటి విలయాన్ని సృష్టించిందో తెలిసిందే. ముఖ్యంగా విశాఖపట్టణం ఎంతగా దెబ్బతిందో మనకు తెలుసు. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు, ఎందరో పెద్ద మనసు చేసుకుని చేసిన సాయంతో ఆ నగరానికి పూర్వపు రూపరేఖలు వచ్చాయి. నాటి తుపాన్ ధాటికి విశాఖలోని 160 ఏళ్ల నాటి కాశింకోట పాఠశాలలో చాలా భాగం కూలిపోయింది.

దీంతో దీని నిర్మాణ బాధ్యతలను తాను తీసుకుంటానంటూ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి నాడు తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. రాజమౌళితో పాటు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, శోభనాద్రి, ప్రశాంతి కలిసి నాలుగు గదుల భవనం నిర్మించేందుకు ముందుకొచ్చారు. ఈ భవనం పూర్తయింది. త్వరలో దీనిని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు తమ ఆనందాన్ని వ్యక్తం చేయడమే కాకుండా రాజమౌళికి ధన్యవాదాలు చెబుతున్నారు. ఈ పాఠశాలలో కొత్త గదులు ఉన్న భవనానికి ‘జననీ రాజనందిని’ అనే పేరును రాజమౌళి పెట్టారు.


More Telugu News