Chandrababu: బీజేపీకి నమస్కారం పెట్టేస్తామన్న చంద్రబాబు వ్యాఖ్యలపై పురందేశ్వరి స్పందన!

  • చంద్రబాబు వ్యాఖ్యలు సమంజసం కాదు
  • ఆయన వ్యాఖ్యలను మా అధిష్ఠానం చూసుకుంటుంది
  • కలసి ఉంటారో, లేదో టీడీపీనే తేల్చుకోవాలి

తాము ఇప్పటికీ మిత్రధర్మాన్ని పాటిస్తున్నామని... విడిపోవాలని బీజేపీ భావిస్తే నమస్కారం పెట్టేస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాబు వ్యాఖ్యలపై బీజేపీ నాయకురాలు పురందేశ్వరి స్పందించారు. తాము మిత్రధర్మం పాటించలేదని చంద్రబాబు అనడం సమంజసం కాదని ఆమె అన్నారు.

తమతో కలసి ఉంటారో, ఉండరో అనే విషయాన్ని టీడీపీనే తేల్చుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను బీజేపీ అధిష్ఠానం చూసుకుంటుందని చెప్పారు. బీజేపీతో కలసి ఉండాలని టీడీపీ భావిస్తుంటే... అదే విషయం గురించి ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబుతో మాట్లాడాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను మార్చి సొంత పథకాలుగా టీడీపీ ప్రచారం చేసుకుంటోందని ఆమె విమర్శించారు. పంచాయతీలకు కూడా కేంద్రం నుంచి నేరుగా నిధులు అందుతున్నాయని చెప్పారు.

రాజీనామాలు చేశాకే టీడీపీలోకి రావాలని పార్టీ నేతలను దివంగత ఎన్టీఆర్ కోరేవారని పురందేశ్వరి అన్నారు. ఫిరాయింపు నేతలపై చర్యలు తీసుకోవాలని... ఇదే విషయంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు లేఖ రాశామని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించుకోవాల్సిన బాధ్యత అన్ని పార్టీలపై ఉందని చెప్పారు. 

More Telugu News