Tirupati: రేటు పెంచుదాం, అడిగినన్నీ ఇద్దాం!: లడ్డూలపై టీటీడీ యోచన

  • భక్తులకు కోరినన్ని లడ్డూలు ఇవ్వాలన్న యోచనలో టీటీడీ
  • ఇప్పటికే బయటకు సరఫరా చేసే లడ్డూల ధర పెంపు
  • రూ. 37కు దిగివచ్చిన లడ్డూ తయారీ ధర

తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు ఇకపై కోరినన్ని లడ్డూలు ఇవ్వాలని, అయితే, లడ్డూ తయారీ లోటును భర్తీ చేసుకునేందుకు ధరలను పెంచాలని తిరుమల తిరుపతి దేవస్థానం యోచిస్తోంది. ఇప్పటికే రూ. 25పై విక్రయించే లడ్డూను రూ. 50కి, కల్యాణోత్సవం లడ్డూను రూ.200కు (వివిధ ప్రాంతాల్లో జరిగే వైభోగ ఉత్సవాల్లో పంచేవి) పెంచిన టీటీడీ, తిరుమల లడ్డూల విషయంలో సైతం ఇదే విధమైన విధానాన్ని అనుసరించాలని ప్రణాళికలు రూపొందించింది.

తిరుమలలో రూ. 50గా ఉన్న లడ్డూకు డిమాండ్ అధికంగా ఉండటంతో, ప్రస్తుతం రోజుకు తయారు చేస్తున్న 30 వేల అదనపు లడ్డూలను 50 వేలకు పెంచాలని కూడా టీటీడీ ఆలోచిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లడ్డూల ధరలను పెంచిన తరువాత లడ్డూ తయారీ ఖర్చు ఒక్కింటికి రూ. 37కు దిగివచ్చింది. ప్రస్తుతం టీటీడీ ఉచితంగా ఒక లడ్డూను, రూ. 10పై రెండు సబ్సిడీ లడ్డూలను, రూ. 25పై రెండు లడ్డూలనూ అందిస్తోంది. ఈ మూడు రకాల లడ్డూలపైనా టీటీడీ ఏటా రూ. 300 కోట్ల భారాన్ని భరిస్తోంది. ఈ మొత్తాన్ని తగ్గించుకునేందుకు, బ్లాక్ మార్కెటింగ్ ను అరికట్టేందుకు ధర పెంచి, పోటునూ విస్తరించాలని టీటీడీ యోచన.

More Telugu News