Andhra Pradesh: వచ్చేనెల 1 నుంచి నూతన భూమార్పిడి సవరణ చట్టం అమల్లోకి.. ఎన్నో ఉపయోగాలు!

  • అనుమతుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు
  • పరిశ్రమల ఏర్పాటు వేగం పుంజుకుంటుంది 
  • APIIC నుంచి భూమి పొందిన వారు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు
  • వివరించిన కేఈ కృష్ణమూర్తి 

వచ్చే నెల 1వ తేది నుంచి నూతన 'నాలా' సవరణ చట్టం అమల్లోకి వస్తుందని, ప్రభుత్వం తీసుకువస్తోన్న ఈ సవరణ చట్టం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా భూమార్పిడి ఫీజులు భారీగా తగ్గుతాయని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. విజయవాడ, విశాఖప‌ట్నం నగరాల్లో ప్రస్తుతం ఉన్న 5 శాతం ఫీజు 2 శాతానికి తగ్గుతుందని చెప్పారు. అలాగే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో 9 శాతంగా ఉన్న ఫీజు 3 శాతానికి తగ్గుతుందన్నారు.

 ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన వేగం పుంజుకుంటాయని తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ లో విద్య, వైద్య పారిశ్రామికపరంగా ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవని అన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను తీసుకువచ్చిందని చెప్పారు.

భూమార్పిడి ఫీజు తగ్గించడంతో పాటు పరిశ్రమల ఏర్పాటు అనుమ‌తులు వేగవంతం చేసేందుకు నాలా చట్టంలో మార్పులు ఉపయోగపడతాయన్నారు. సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత ఫీజు చెల్లించిన వెంటనే భూమార్పిడి వర్తిస్తుందని కేఈ కృష్ణమూర్తి వివ‌రించారు. అనుమతుల కోసం ఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, అలాగే పరిశ్రమల ఏర్పాటు కొరకు APIIC ద్వారా భూమిని పొందినవారు ఎలాంటి భూమార్పిడి రుసుమును చెల్లించాల్పిన అవసరం ఉండదని పేర్కొన్నారు.      

More Telugu News