Shravanabelagola: బాహుబలి మహామస్తకాభిషేకానికి సిద్ధమైన శ్రావణబెళగొల... భారీ ఏర్పాట్లు

  • ఫిబ్రవరి 17 నుంచి 26 వరకు ఉత్సవాలు
  • 20-30 లక్షల మంది వస్తారని అంచనా
  • రూ.175 కోట్లతో భారీ ఏర్పాట్లు
  • ప్రత్యేకంగా 12 టౌన్ షిప్ ల నిర్మాణం
  • 12 ఏళ్లకోసారి జరిగే మహా క్రతువు ఇది

కర్ణాటక రాష్ట్రంలోని శ్రావణబెళగొలలో అతి త్వరలో జరగనున్న బాహుబలి మహామస్తకాభిషేకానికి సర్వం సిద్ధమవుతోంది. జైనుల ఆధ్యాత్మిక కేంద్రమైన ఇక్కడ ప్రతీ 12 ఏళ్లకోసారి పెద్ద ఎత్తున ఉత్సవం జరుగుతుంది. జైనుల మొదటి తీర్థంకరుడి కుమారుడు బహుబలిని తమ ఆరాధ్యదైవంగా జైనులు కొలుస్తారు. శ్రావణబెళగొలలో 57 అడుగుల ఎత్తున బాహుబలి విగ్రహం ఉంది. గంగా రాజవంశంలో మంత్రిగా చేసిన చాముండరాయ ఒకే రాతిపై దీన్ని చెక్కించారు. అప్పటి నుంచి ప్రతీ 12 ఏళ్లకోసారి ఇక్కడ పెద్ద ఎత్తున కుంభమేళా తరహాలో ఉత్సవం నిర్వహిస్తూ వస్తున్నారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది జైనులు తరలివస్తుంటారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి 26 వరకు ఇక్కడ ఉత్సవాలు జరగనున్నాయి. 57 అడుగుల బాహుబలి విగ్రహానికి వింధ్య పర్వతంపై నుంచి పాలు, చెరకురసం తర్వాత పసుపు, చందనం, సిందూరంతో అభిషేకిస్తారు. ఇది జైన సంప్రదాయంలో భాగం. ఈ ఉత్సవాలకు ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.

భారీ సంఖ్యలో వచ్చే జైనుల కోసం తాత్కాలికంగా 12 టౌన్ షిప్ ల నిర్మాణం కూడా చేశారు. అన్ని కనీస అవసరాలు కల్పించారు. జైన సాధువుల కోసం ప్రత్యేకంగా త్యాగి నగర్ పేరుతో ఓ టౌన్ షిప్ నిర్మాణం కూడా జరిగింది. ఈ భారీ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.175 కోట్లు కేటాయించింది. మిగిలిన వ్యయాన్ని శ్రావణబెళగొలకు చెందిన జైన మఠం భరిస్తుందని మఠం చీఫ్ జైన్ ముత్ తెలిపారు. ఈ ఏడాది ఉత్సవాలకు 30-40 లక్షల మంది హాజరవుతారని అంచనా. ఉత్సవాలకు సంబంధించిన ముందస్తు క్రతువులు ఈ నెల 7నే మొదలవుతాయి. అసలు ఉత్సవాలు ఫిబ్రవరి 17న మొదలై 26న ముగుస్తాయి.

More Telugu News