facebook: భార‌త్‌లో అందుబాటులోకి వ‌చ్చిన ఫేస్‌బుక్ మార్కెట్ ప్లేస్‌!

  • వ‌స్తువుల‌ను అమ్మ‌డం, కొన‌డం ఇక మ‌రింత సుల‌భ‌త‌రం
  • మెసెంజ‌ర్ ద్వారా బేర‌మాడుకునే స‌దుపాయం
  • ఓఎల్ఎక్స్‌, క్విక‌ర్‌ల‌కు క‌ష్ట‌కాలం

సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్‌బుక్ వారి మార్కెట్ ప్లేస్ ఫీచ‌ర్ భార‌త్‌లో అందుబాటులోకి వ‌చ్చింది. దీని ద్వారా వ‌స్తువులు అమ్మ‌డం, కొన‌డం మ‌రింత సుల‌భ‌త‌రం కానుంది. మెసెంజ‌ర్ ద్వారా స‌రాస‌రి అమ్ముతున్న వారితో చాటింగ్ చేసి, బేర‌మాడుకునే స‌దుపాయం కూడా ఉంది. దీంతో ఇప్ప‌టికే ఇలాంటి స‌దుపాయాన్ని అందిస్తున్న ఓఎల్ఎక్స్‌, క్విక‌ర్ వంటి సంస్థ‌ల‌కు క‌ష్టకాలం వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని విశ్లేషకులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఫేస్‌బుక్ తెర‌వ‌గానే ఎడ‌మ వైపు ప్రొఫైల్ వివ‌రాల కింద మార్కెట్‌ప్లేస్ ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయ‌గానే అమ్మ‌కానికి సిద్ధంగా ఉన్న వ‌స్తువుల వివ‌రాలు క‌నిపిస్తాయి. అంతేకాకుండా కావాల్సిన వ‌స్తువును సెర్చ్ చేసి, కావాల్సిన ధ‌ర‌కు ఫిల్ట‌ర్ చేసే అవ‌కాశం కూడా ఇక్క‌డ ఉంది. కావాల్సిన వ‌స్తువును క్లిక్ చేసి అది పోస్ట్ చేసిన వారికి మెసేజ్ చేసి బేర‌మాడుకోవ‌చ్చు. ఈ ఫీచ‌ర్ కొత్త‌గా రావ‌డంతో చాలా మంది దీన్ని ప‌రీక్షించే ఉద్దేశంతో స‌రైన ధ‌ర‌ల‌ను పోస్ట్ చేయ‌డం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అందుకే కొన్ని వ‌స్తువుల ధ‌ర‌లు న‌మ్మ‌శ‌క్యంగా వుండడం లేదు.

ఒక‌వేళ ఏదైనా అమ్మాల‌నుకుంటే.. పైన ఉన్న సెల్ సమ్‌థింగ్ బ‌ట‌న్ నొక్కి, వ‌స్తువు వివ‌రాల‌ను, ధ‌ర‌ను, ఫొటోల‌ను అప్‌లోడ్ చేస్తే స‌రిపోతుంది. మీరు అమ్మిన వ‌స్తువులు, బేర‌మాడిన వివ‌రాల‌ను కూడా ఇక్కడ చూసుకునే అవ‌కాశ‌ముంది. అంతేకాకుండా కేటగిరీల ఆధారంగా కూడా వ‌స్తువుల‌ను ఫిల్ట‌ర్ చేసే స‌దుపాయాన్ని కూడా ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్ క‌ల్పించింది.

More Telugu News