Pawan Kalyan: జనసేన పార్టీ విధానాలను ఏడు సిద్ధాంతాలుగా విభజించి ప్రకటించిన పవన్ కల్యాణ్

  • అవినీతి, అక్ర‌మాల‌పై రాజీలేని పోరాటం చేస్తాం
  • ప‌ర్యావ‌రణాన్ని ప‌రిర‌క్షించే విధానం అనుసరిస్తాం
  • కులాల‌ను విస్మ‌రించి రాజ‌కీయాలు చేయ‌లేం
  • అందుకే ముఖ్యంగా కులాలని కలిపే ఆలోచన విధానం తీసుకున్నాం

జనసేన పార్టీ విధానాలను ఏడు సిద్ధాంతాలుగా విభజించినట్లు ఆ పార్టీ అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ చెప్పారు. కరీంనగర్ లోని శుభమ్ గార్డెన్స్ లో నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, క‌రీంన‌గ‌ర్ నుంచి వచ్చిన జనసేన కార్యకర్తలు, అభిమానులతో సమావేశమైన పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 'కులాలని కలిపే ఆలోచన విధానం.. మతాల ప్రస్తావన లేని రాజకీయం.. భాషల్ని గౌరవించే సంప్రదాయం.. సంస్కృతులని కాపాడే సమాజం.. ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం.. అవినీతి, అక్ర‌మాల‌పై రాజీలేని పోరాటం.. ప‌ర్యావ‌రణాన్ని ప‌రిర‌క్షించే విధానం' తమ సిద్ధాంతాలని చెప్పారు.

మ‌న భార‌త‌దేశంలో కులాల‌ను విస్మ‌రించి రాజ‌కీయాలు చేయ‌లేమని, అందుకే త‌మ సిద్ధాంతాల్లో ముఖ్యంగా కులాలని కలిపే ఆలోచన విధానం తీసుకున్నాన‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు. తాను ఏ ఒక్క‌రితోనూ వ్య‌క్తిగ‌త శత్రుత్వం పెట్టుకోద‌లుచుకోలేదని అన్నారు. ఏ పార్టీ అయినా సిద్ధాంతాలు లేనిదే ముందుకు వెళ్లలేదని అన్నారు. 2019లో తెలంగాణలోనూ పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఈ సమావేశం అనంతరం పవన్ కల్యాణ్ కొత్తగూడెం బ‌య‌లుదేరారు.   

More Telugu News