rich: ఈ ప్రపంచంలో ఆ 42 మంది సంపద... 370 కోట్ల మంది సంపదతో సమానమట!

  • సంపదలో భారీ అసమానతలు
  • దేశంలో 101 మంది బిలియనీర్లు
  • గతేడాది వీరి సంపదలో రూ.5 లక్షల కోట్ల వృద్ధి
  • ఆక్స్ ఫామ్ నివేదికలో నివ్వెరపరిచే నిజాలు

ఆకలి తీరని ప్రజానీకం ఒకవైపు.. తరతరాలుగా కూర్చుని తిన్నా తరిగిపోని సంపద జనులు మరోవైపు... ఈ ప్రపంచం నడుస్తున్న వికృత తీరును, సంపద కేవలం కొద్ది మందికే దాసోహం అంటున్న కఠోర వాస్తవాన్ని ఆక్స్ ఫామ్ నివేదిక కళ్లకు కడుతోంది. సంపన్నులకే ప్రయోజనాలు కల్పిస్తూ పేదలను విస్మరిస్తున్న విధానాలు, సమాజ పోకడను గణాంకాలతో ఏకిపారేసింది ఈ నివేదిక. ప్రపంచ జనాభాలో కేవలం 42 మంది వ్యక్తుల వద్దనున్న సంపద విలువ, 370 కోట్ల మంది పేదల మొత్తం సంపదతో సమానం. ఇలాంటి అసమానతలు కళ్లకు కట్టే గణాంకాలు ఎన్నో ఈ నివేదికలో ఉన్నాయి.

నివేదిక హైలైట్స్

  • భారత్ లో 101 మంది బిలియనీర్లు (రూ.6,500 కోట్లకుపైన) ఉన్నారు. వీరి సంపద 2017లో రూ.4,89,000 కోట్ల మేర వృద్ధి చెందింది. మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విద్య, ఆరోగ్యానికి  కావాల్సిన నిధుల్లో 85 శాతం మొత్తం ఇది.
  • మన దేశంలో అట్టడుగున ఉన్న 50 శాతం మంది ప్రజానీకం అంటే 67 కోట్ల మంది సంపదలో గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో పెరుగుదల ఒక్క శాతం మాత్రమే.
  • 2017లో ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంపద 762 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు రూ.6,500 కోట్లు.
  • ప్రపంచ వ్యాప్తంగా 2,043 మంది బిలియనీర్లున్నారు. వీరిలోనూ స్త్రీ, పురుషుల మధ్య అంతరం చాలానే ఉంది. 1,816 మంది పురుషులు కాగా, 217 మంది మహిళలు ఉన్నారు. మిగిలిన సంఖ్య జంటలది.
  • ప్రపంచ ఐశ్వర్యవంతులలో ఒక్క శాతం మంది ఏటా ఎగవేసే పన్నుల మొత్తమే 200 బిలియన్ డాలర్లు.

More Telugu News