తెలంగాణలో పవన్ ను అడ్డుకుని తీరుతాం: మాల మహానాడు హెచ్చరిక

23-01-2018 Tue 08:31
  • గతంలో ఇచ్చిన హామీలను విస్మరించారు
  • మరోసారి మోసం చేసేందుకే పర్యటనలు
  • అన్ని ప్రాంతాల్లో అడ్డుకోవాలని పిలుపు

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ రాజకీయ పర్యటనను తెలంగాణలో అడ్డుకుని తీరుతామని  మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు బీ దీపక్‌ కుమార్‌ హెచ్చరికలు జారీ చేశారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ఆయన 'ప్రజారాజ్యం' పార్టీ తరఫున ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో ప్రచారం నిర్వహించారని గుర్తు చేసిన ఆయన, దళితులు, గిరిజనులకు ఇచ్చిన హామీలను విస్మరించారని ఆరోపించారు.

మాల మహానాడు రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, సమస్యల అధ్యయనం పేరిట మరోసారి ప్రజలను మోసం చేసేందుకే పవన్‌ యాత్రను ప్రారంభించారని అన్నారు. రాష్ట్రంలోని బహుజనులను మోసం చేసి, రాజకీయ పబ్బం గడుపుకోవాలన్నదే పవన్ కోరికని, ఆయన పర్యటనను అన్ని ప్రాంతాల్లో అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.