kcr: గౌరవెల్లి జలాశయం నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి హరీశ్ రావు

  • వరంగల్, జనగామ, కరీంనగర్ జిల్లాల్లో కరవు పీడిత ప్రాంతాలకు ఈ రిజర్వాయర్ వరం
  • ప్రజలకు సేవకుడిలా పని చేయాలని మా నాయకుడు కేసీఆర్ మాకు నేర్పారు
  • రాష్ట్రంలో ఇంకా ఇరవై ఏళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుంది:  హరీశ్ రావు

పదవి వస్తే ఇంకా అణగిమణగి ఉండాలని, ప్రజలకు సేవకుడిలా పని చేయాలని తమ నాయకుడు కేసీఆర్ తమకు నేర్పారని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లాలోని హుస్నాబాద్ డివిజన్ లో ఉన్న గౌరవెల్లి జలాశయం నిర్మాణానికి హరీశ్ రావు ఈరోజు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘గౌరవెల్లి’ ద్వారా లక్షా 20వేల ఎకరాలకు సాగు, తాగునీరు అందుతుందని, వరంగల్, జనగామ, కరీంనగర్ జిల్లాల్లోని కరవు పీడిత ప్రాంతాలకు ఈ రిజర్వాయర్ వరం అని అన్నారు. ప్రజలకు సేవ చేసి వారి రుణం తీర్చుకుంటామని, వారి బాధల్ని, కష్టాలను తొలగించడం తమ బాధ్యత అని అన్నారు. ప్రజల కలలను నిజం చేయడం తమ బాధ్యత అని, తమపై విశ్వాసం ఉంచాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

‘కుటుంబంలో తల్లిదో మాట, తండ్రిదో మాట, అన్నదో మాట, అక్కదో మాట, చెల్లెదో మాట...ఉంటాయి. ఇంత పెద్ద ప్రాజెక్టు కడితే భిన్నాభిప్రాయాలు ఉండటం సహజం’ అని అన్నారు. ఎవరు ఔనన్నా, కాదన్నా రాష్ట్రంలో ఇంకా ఇరవై ఏళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుందని ఈ సందర్భంగా హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఎస్సాఆర్ ఎస్పీ నిండినా, నిండక పోయినా, వరద వచ్చినా, రాకపోయినా కాళేశ్వరం ద్వారా  వరద కాలువ ప్రాజెక్టు ఒక్క ఏడాదిలోనే జీవకాలువగా మారనుందని, 1.4 టీఎంసీల వరద కాలువ ఉన్నప్పుడు 693 ఇండ్లు మునిగితే, ఇప్పుడు 9 టీఎంసీలకు పెంచినా అదనంగా మునుగుతున్న ఇండ్లు 150 మాత్రమేనని అన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా పాలకులు రైతులకు నీళ్లు ఇచ్చే ఉద్దేశ్యంతో ప్రాజెక్టులు కట్టలేదని, వాటిని తూతూమంత్రంగా చేపట్టారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని, ఇప్పటికే 75 శాతం పూర్తయిందని, మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్మాణం 96 శాతం పూర్తయిందని అన్నారు. ఎవరు అడ్డుపడ్డా వచ్చే వానా కాలానికి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు హుస్నాబాద్ కు వస్తాయని స్పష్టం చేశారు.

గౌరవెల్లి ప్రాజెక్టులో 900 ఇండ్లు ముంపునకు గురవుతుంటే ఇందులో 700కు పైగా కుటుంబాలు ఒప్పుకోవడం జరిగిందని, మిగిలిన 220 కుటుంబాలతో మాట్లాడి ఒప్పిస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భూ నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ సర్కారు హయాంలో ఎకరాకు 2 లక్షలు ఇస్తే, తమ ప్రభుత్వం ఎకరాకు దాదాపు 7 లక్షలు చెల్లిస్తున్నామని చెప్పారు.

గతంలో చేసిన డిజైన్ వల్ల లక్షా 60 వేల ఎకరాలకు సాగునీరివ్వడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించారని హరీశ్ రావు చెప్పారు. దీంతో ఈ జలాశయం సామర్థ్యం పెంచాలని సీఎం నిర్ణయించారని తెలిపారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రీ డిజైన్ చేయించి 9 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉండేలా చేశారని వివరించారు. దీంతో గౌరవెల్లి రిజర్వాయరు ద్వారా కరవు పీడిత ప్రాంతాలలో ఒక లక్ష 60 వేల ఎకరాలకు సాగు, తాగునీరు రెండు పంటలకూ అందుతుందని అన్నారు. గౌరవెల్లి రిజర్వాయరు సామర్థ్యం పెంపుతో లాభాలు, ఎక్కువ ఆదాయ వనరులు గుడాటిపల్లి గ్రామస్తులకే దక్కుతాయని చెప్పారు.

More Telugu News