Virat Kohli: కోహ్లీ తీరు భరించలేనంతగా తయారైంది.. బీసీసీఐ భయపడుతోంది: గుహ

  • కోహ్లీ పెత్తనం పెరిగి పోయింది
  • ఇది భారత క్రికెట్ కు మంచిది కాదు
  • శ్రీలంకతో గల్లీ క్రికెట్ ఆడకుండా... దక్షిణాప్రికా వెళ్లి ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడాల్సింది

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రశ్నించేందుకు కూడా బీసీసీఐ భయపడుతోందని బీసీసీఐ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ మాజీ సభ్యుడు రామచంద్ర గుహ అన్నారు. ఈ మేరకు 'ది టెలిగ్రాఫ్'కు రాసిన కాలమ్ లో ఆయన అభిప్రాయపడ్డారు. భారత క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ లో కోహ్లీ ప్రమేయం భరించలేనంతగా తయారయిందని గుహ తెలిపారు. ప్రస్తుతం కోహ్లీ ముందు మిగిలిన అందరూ మరుగుజ్జులుగా మారిపోయారని చెప్పారు. ప్రధాని మోదీని కేంద్ర మంత్రులు కీర్తిస్తున్న దానికంటే ఎక్కువగా కోహ్లీని బీసీసీఐ కీర్తిస్తోందని ఎద్దేవా చేశారు.

నేషనల్ క్రికెట్ అకాడమీ, భవిష్యత్తు విదేశీ టూర్లకు సంబంధించిన వ్యవహారాల్లో సైతం కోహ్లీ అభిప్రాయాన్ని బీసీసీఐ తీసుకుంటోందని గుహ అన్నారు. ఉపఖండం వెలుపల టీమిండియా ఓటమిలకు ఇవన్నీ కారణాలే అని తెలిపారు. కోహ్లీ గొప్ప ప్లేయర్, గొప్ప నాయకుడే కావచ్చని... అయితే వ్యవస్థాగతమైన మార్పులు రాకపోతే అతని టీమ్ గొప్ప విజయాలను సాధించలేదని చెప్పారు. వ్యవస్థ మొత్తం ఒక వ్యక్తికి సబార్డినేట్ గా ఉండే పరిస్థితి ఉందని... ఏమాత్రం కోచింగ్ ఎక్స్ పీరియన్స్ లేని రవిశాస్త్రిని హెడ్ కోచ్ గా చేయడం కూడా దీనికొక నిదర్శనమని తెలిపారు.

సొంతగడ్డపై బలహీన జట్లపై గెలవడం వల్ల... రవిశాస్త్రి ఎంపిక నిర్ణయంపై సందేహాలు తలెత్తలేదని... శాస్త్రి ఎంపిక తప్పు అనే వాస్తవాన్ని ఎంతో కాలం దాచలేరని గుహ అన్నారు. దక్షిణాఫ్రికాలో ప్రాక్టీస్ మ్యాచ్ ను క్యాన్సిల్ చేయాలన్న టీమ్ మేనేజ్ మెంట్ ప్రపోజల్ ను బోర్డు కానీ, సెలక్టర్లు కానీ కాదనలేకపోయారని విమర్శించారు. భారత్ లో శ్రీలంకపై గల్లీ క్రికెట్ ఆడకుండా... ముందుగానే దక్షిణాఫ్రికాకు వెళ్లి, కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడుంటే బాగుండేదని అన్నారు.

సెలక్టర్లుగా ఉండేవారు గొప్ప క్రికెటర్లు కాకపోయినప్పటికీ... కెప్టెన్ కు దీటుగా అథారిటీ చలాయించే స్థాయిలో ఉండాలని చెప్పారు. అవసరమైనప్పుడు కోహ్లీ వ్యక్తిగత నిర్ణయాలను ప్రశ్నించే స్థాయిలో కోచ్ ఉండాలని అన్నారు. విదేశాల్లో ఎక్కువ విజయాలు సాధించేలా షెడ్యూల్ క్యాలెండర్ ను రూపొందించుకోవాలని సూచించారు. 

More Telugu News