Delhi: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 17 మంది సజీవ దహనం!

  • ప్లాస్టిక్ కంపెనీలో చెలరేగిన మంటలు
  • మృతి చెందిన వారిలో 10 మంది మహిళలు
  • షాక్‌కు గురైన ప్రధాని, సీఎం కేజ్రీవాల్

ఢిల్లీలోని పారిశ్రామికవాడలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 17 మంది సజీవ దహనమయ్యారు. బవానా ప్రాంతంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఓ ప్లాస్టిక్ పరిశ్రమ గోదాంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. తొలి అంతస్తులో 13 మంది, కింది అంతస్తులో మరో నలుగురు మృతి చెందారు. మృతి చెందిన 17 మందిలో పదిమంది మహిళలు ఉన్నారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. 20 అగ్నిమాపక శకటాలు మంటలను అదుపు చేస్తున్నాయి. మూడంతస్తుల ఈ భవనంలో కింది ఫ్లోర్‌లో మంటలు అంటుకున్నాయి. అగ్నికీలలు వేగంగా వ్యాపించడంతో పై అంతస్తులో ఉన్న కొందరు కార్మికులు పై నుంచి కిందికి దూకేయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. అయితే మహిళలు, ఇంకొందరు చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన ఇద్దరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి మనోజ్ జైన్ అనే వ్యక్తితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు డీసీపీ (రోహిణి) రజ్‌నీష్ గుప్తా తెలిపారు.  

విషయం తెలిసిన ప్రధాని నరేంద్రమోదీ షాక్ అయ్యారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అర్‌వింద్ కేజ్రీవాల్ విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. వైద్యశాఖ మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఎయిమ్స్, సఫ్దర్‌జంగ్ ఆసుపత్రులను సిద్ధం చేసినట్టు చెప్పారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్టు ఢిల్లీ పట్టణాభివృద్ధి శాఖా మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు.

More Telugu News