Vijayawada: ఈ సారి విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో గణతంత్ర దినోత్సవం.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష!

  • నిర్వహణ బాధ్యతలు కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతంకు
  • ఈ నెల 25వ తేదీనే విజయవాడకు గవర్నర్
  • 26వ తేదీ ఉదయం వేడుకల్లో పాల్గొననున్న నరసింహన్
  • 13 శకటాలను ప్రదర్శించనున్న వివిధ ప్రభుత్వ శాఖలు 

విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించే గణతంత్ర వేడుకల ఏర్పాట్లను వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ సచివాలయం 1 బ్లాక్ మొదటి అంతస్తు సీఎస్ సమావేశ మందిరంలో సమీక్షించారు. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగే గణతంత్ర వేడుకల నిర్వహణ బాధ్యతలను కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతంకు అప్పగించారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఈ నెల 25వ తేదీనే విజయవాడ వస్తారని, ఆ రాత్రికి ఇక్కడే బస చేసి, 26వ తేదీ ఉదయం వేడుకల్లో పాల్గొంటారని అధికారులు చెప్పారు. వివిధ ప్రభుత్వ శాఖల వారు 13 శకటాలను ప్రదర్శిస్తారని సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్ చెప్పారు.

వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, పశు సంవర్థక శాఖలు, ఆర్టీసీ, కమాండ్ కంట్రోల్ సెంటర్, ఫైబర్ నెట్, సీఆర్డీఏ, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, విద్యుత్ శక్తి, మానవ వనరులు, సర్వశిక్ష అభియాన్, ప్రాథమిక విద్య, అటవీ శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, సాంఘిక సంక్షేమం, మహిళా, శిశు సంక్షేమం, పర్యాటక, సాంస్కృతిక, నీటి వనరులు, ఆరోగ్య, పౌరసరఫరాలు, గృహ నిర్మాణ శాఖల వారు తమ శకటాలను ప్రదర్శిస్తారని ఆయన వివరించారు.

టాయిలెట్స్, తాగునీటి సౌకర్యాలను పట్టణ పరిపాలన, నగరాభివృద్ధి సంస్థ వారు చూస్తారని అధికారులు చెప్పారు. పాఠశాల విద్యార్థులు, ఎన్ సీసీ, స్కౌట్ విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు. స్టేడియంలో ఆరు ట్రాన్స్ ఫార్మర్స్ ఉన్నాయని, అత్యవసర సమయంలో ఉపయోగం కోసం ఒక జనరేటర్ ని ఏర్పాటు చేసినట్లు ఏపీ ట్రాన్స్ కో అధికారి తెలిపారు. మంత్రులకు, ముఖ్యులకు ఆహ్వానాలు పంపుతామని, సమాచార, పౌరసంబంధాల శాఖ వారు ఇచ్చిన జాబితా ప్రకారం మీడియా పాస్ లు ఇస్తామని ప్రొటోకాల్ అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ కల్నల్ ఎం.అశోక్ బాబు చెప్పారు.

అంబులెన్స్ లు సిద్ధంగా ఉన్నట్లు వైద్యశాఖ వారు తెలిపారు. అలాగే ఆర్టీసీ, ట్రాన్స్ పోర్ట్, విపత్తుల నిర్వహణ (డిజాస్టర్ మేనేజ్ మెంట్), రోడ్లు, భవనాల తదితర శాఖల అధికారులు తాము చేస్తోన్న పనులను వివరించారు. అధికారులు లేవనెత్తిన పలు సమస్యలకు సీఎస్ పరిష్కారాలను చెప్పారు. జిల్లా కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, హార్టీకల్చర్ అధికారులు చర్చించుకొని ఉద్యానవనం ఏర్పాటు చేయమని సలహా ఇచ్చారు. తగిన జాగ్రత్తలు తీసుకొని వేడుకలు చక్కగా నిర్వహించమని కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతంను ఆదేశించారు.

ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్‌, డీజీపీ ఎం.మాలకొండయ్య, సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్, మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కె.కరికాల వలవన్, ఐజీపీ హ‌రీష్ గుప్తా, విజ‌య‌వాడ పోలీసు క‌మిష‌న‌ర్ గౌత‌మ్ స‌వాంగ్‌ తదితరులు పాల్గొన్నారు.   

More Telugu News