metro pillar: నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్ల‌ర్ నుంచి జారిప‌డ్డ ఇనుప రాడ్‌... కారులోకి చొచ్చుకుపోయిన వైనం

  • సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డిన డ్రైవ‌ర్‌
  • ఎల్ అండ్ టీ నిర్ల‌క్ష్యంపై పోలీసుల‌కు ఫిర్యాదు
  • మ‌ల‌క్‌పేట్ మెట్రో స్టేషన్ వద్ద ఘ‌ట‌న‌

మ‌ల‌క్‌పేట్ మెట్రో స్టేష‌న్ నిర్మాణం జ‌రుగుతున్న ప్రాంతంలో మెట్రోపిల్ల‌ర్ పై నుంచి ఓ ఇనుప రాడ్ జారిప‌డి, కింద రోడ్డు మీద వెళ్తున్న కారు ముందుభాగంలోకి చొచ్చుకుని పోయింది. కారు న‌డుపుతున్న అబ్దుల్ అజీజ్ సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డిన‌ప్ప‌టికీ, మెట్రో నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ నిర్ల‌క్ష్యంపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

'అదృష్ట‌వ‌శాత్తు కారు ముందుభాగంలో ప‌డింది కాబ‌ట్టి స‌రిపోయింది. అదే అద్దం మీద గానీ, రోడ్డు మీద న‌డుస్తున్న వ్య‌క్తి మీద గానీ ప‌డి ఉంటే ఊహించరాని ప్ర‌మాదం జ‌రిగేది. ఈ నిర్ల‌క్ష్య ధోర‌ణికి ఎల్ అండ్ టీ స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది' అని అబ్దుల్ అన్నాడు.

ఈ ప్ర‌మాదంపై స్పందిస్తూ ఎల్ అండ్ టీ మెట్రో ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ ప్రమాదం జ‌రిగినందుకు తాము చింతిస్తున్నామ‌ని, ఇది జ‌ర‌గ‌డానికి గ‌ల కార‌ణాల‌ను విచారిస్తామ‌ని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. అబ్దుల్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు చాద‌ర్‌ఘాట్ పోలీసులు సెక్ష‌న్ 336 కింద ఎల్ అండ్ టీ మీద కేసు న‌మోదు చేసిన‌ట్లు తెలుస్తోంది.

More Telugu News