Andhra Pradesh: ఈ నెల 22న గుంటూరు కలెక్టరేట్ ఎదుట నా ఆత్మహత్య.. అధికారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న రైతు వీడియో!

  • వ్యవసాయంలో నష్టపోయిన రైతు
  • పాస్ పుస్తకం కోసం అధికారుల ఇబ్బందులు
  • భరించలేక ఆత్మహత్యకు సిద్ధమైన రైతు

గుంటూరు జిల్లా కారంపూడి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఓ రైతు సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ వీడియో ఇప్పుడు అధికారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఈ నెల 22న గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ రైతు రాజు వీడియోను పోస్టు చేశాడు. తనకు వారసత్వంగా వచ్చిన ఎకరం పొలంతోపాటు మరో 22 ఎకరాలు కౌలుకు తీసుకుని పంట వేస్తే తెగులు సోకి పంట మొత్తం పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు.  పంట కోసం చేసిన రూ.8 లక్షల అప్పు వడ్డీతో రూ.10 లక్షలు అయిందన్నాడు.

అప్పు తీర్చేందుకు ఉన్న ఎకరం భూమిని విక్రయించే ఉద్దేశంతో పాస్ పుస్తకం కోసం గతేడాది మేలో సర్వేయర్‌కు దరఖాస్తు చేసుకున్నానని, ఇప్పటికి పదిసార్లు తిరిగినా పుస్తకం ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడుతున్నారని వివరించాడు. ఇక తన వల్ల కాదని, ఈనెల 22న గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని వీడియోలో పేర్కొన్నాడు.

తాను చనిపోతే చంద్రన్న బీమా కింద వచ్చే రూ. 5 లక్షలతోపాటు పొలంలో సగం అమ్మడం ద్వారా వచ్చే రూ.5 లక్షలు కలిపి అప్పు తీర్చేయాలని కుటుంబ సభ్యులకు సూచించాడు. అలాగే ఈ నెల 22 లోపు ఎవరికైనా కిడ్నీ కావాలన్నా తనను సంప్రదించవచ్చని కోరాడు. తనకు భార్య, రెండున్నరేళ్ల పాప, పదినెలల బాబు ఉన్నారని తెలిపాడు. ఇప్పుడీ వీడియో వైరల్ కావడంతో గురజాల ఆర్డీవో మురళి విచారణ చేపట్టారు.

More Telugu News