Harish Rao: ప్రతిష్ఠాత్మక సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు స్టేజ్-1 కు కేంద్ర అటవీ శాఖ అనుమతులు

  • 3781 ఎకరాల అటవీ భూముల సేకరణకు సంబంధించిన అనుమతులు 
  • అటవీ భూములను ఇరిగేషన్ శాఖకు బదిలీ చేయడానికి సన్నాహాలు 
  • ప్రాజెక్టు పూర్తయితే 3,45,534 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ

సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు స్టేజ్ 1కు కేంద్ర‌ అటవీ శాఖ‌ అనుమతులు లభించాయని ఆ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ సుధాకర్ చెప్పారు. 3781 ఎకరాల అటవీ భూముల సేకరణకు సంబంధించిన అనుమతులు కూడా వ‌చ్చాయ‌ని వివ‌రించారు. అటవీ భూములను ఇరిగేషన్ శాఖకు బదిలీ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు. భద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలోని మణుగూరు, పాల్వంచ, కొత్త గూడెం అటవీ డివిజన్లలోని 1201 హెక్టార్లు, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, ఖమ్మం అటవీ డివిజన్ లలోని 330 హెక్టార్ల అటవీ భూమిని ఇరిగేషన్ శాఖకు బదలాయించేందుకు చెన్నైలోని అటవీ, పర్యావరణ ప్రాంతీయ కార్యాలయం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిన‌ట్లు తెలిపారు. ప్రాజెక్టులోని పైపు లైన్లు, గ్రావిటీ కేనాల్స్, కేనాల్స్ పై స్ట్ర‌క్చర్లు, విద్యుత్ లైన్లు, టన్నెల్స్ నిర్మించడానికి ఈ అటవీ భూములు అవసరమవుతున్నాయని అన్నారు.

 హ‌రీశ్ రావు ఏమ‌న్నారంటే..
సీతారామ ప్రాజెక్టు స్టేజ్ 1 కు అటవీ అనుమతులు లభించడం పట్ల ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ హర్షం వ్య‌క్తం చేశారు. సీతారామా ప్రాజెక్టు స్టేజ్ 1 కు అటవీ అనుమతులు వచ్చినందున ఇక‌పై స్టేజ్ 2 కు చెందిన అనుమతుల ప్రక్రియకు కృషి చేయాలని అధికార యంత్రాంగాన్ని కోరారు. అలాగే ఎకో సెన్సిటివ్ జోన్ లోని 275 హెక్టార్లు (6880 ఎకరాల) కేంద్ర వన్యప్రాణి బోర్డు అనుమతి కోసం కేంద్ర మంత్రి హర్షవర్థ‌న్ కు విజ్ఞప్తి చేశామని ఆయన తెలిపారు.  

ఈ ప్రాజెక్టుకు చెందిన భూసేకరణ, అటవీ, పర్యావరణ, వన్య ప్రాణి అనుమతులు, పంప్ హౌజ్ లు, కెనాల్స్, ఇతర పనుల పురోగతిపై తాను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నానని చెప్పారు. 6 లక్షల 74 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో తలపెట్టిన సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతి ఇంకా వేగంగా జరగాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే 3,45,534 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగనునుందని చెప్పారు. ఇకపై రెగ్యులర్ గా సీతారామ ప్రాజెక్టుపై సమీక్ష జరపనున్నట్టు హరీశ్ రావు చెప్పారు.

ఈ ప్రాజెక్టు కోసం సేకరిస్తున్న అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా 4050 ఎకరాలను కొత్తగూడెం, ఖమ్మం, జగిత్యాల జిల్లాలలో గుర్తించామని మంత్రి తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఇచ్చారని హరీశ్ రావు చెప్పారు. ప్రత్యామ్నాయ అటవీ భూములలో అడవులు పెంచేందుకు అవసరమయ్యే నిధులను అంచనా వేసి ఇరిగేషన్ శాఖకు వెంటనే సమర్పించాలని అటవీ శాఖను మంత్రి కోరారు. సీతారామ ప్రాజెక్టులోని అన్ని ప్యాకేజీలలోనూ యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలని హరీశ్ రావు సూచించారు.

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రాజెక్టుల నిర్మాణంలో ప్ర‌తిష్ఠాత్మకంగా ముందుకు సాగుతోందన్నారు. ఒక్కో ప్రాజెక్టును వ‌రుస‌గా పూర్తి చేసేందుకు ప‌క్కా ప్ర‌ణాళిక‌లు వేస్తోందని చెప్పారు. ఈ క్ర‌మంలో సీతారామ ప్రాజెక్టు విషయంలో ముంద‌డుగు ప‌డిందని అన్నారు. పూర్వ ఖ‌మ్మం, మ‌హ‌బూబాబాద్ జిల్లాల ప‌రిధిలో సీతారామా లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్టు ద్వారా 6.75 ల‌క్షల ఎక‌రాల్లో సాగునీటిని అందించేందుకు రూప‌క‌ల్ప‌న చేశామని మంత్రి హరీశ్ రావు వివరించారు.           

More Telugu News