Supreme Court: ఏ వ్యవస్థకైతే అసహనం రాకూడదో దానికీ వచ్చేసింది!: తమ్మారెడ్డి భరద్వాజ

  • న్యాయవ్యవస్థకే అసహనం వచ్చిందంటే మనం ఆలోచించాలి
  • దేశమంతా ఆలోచించాల్సిన పరిస్థితి ఇది!
  • ఈ ప్రభుత్వాన్ని గెలిపించింది దేశంలో మార్పు కోసం.. అసహనం రావాలని కాదు: ‘నా ఆలోచన’లో తమ్మారెడ్డి

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై నలుగురు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్, రంజన్ గొగోయ్, కురియన్ జోసఫ్, మదన్ లోకుర్ లు బహిరంగ ఆరోపణలు చేసి సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. ‘నా ఆలోచన’ ద్వారా తన అభిప్రాయాలను తెలియజేసే ప్రముఖ దర్శక - నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ విషయమై స్పందించారు.

ఇందుకు సంబంధించిన వీడియోలో ఆయన మాట్లాడుతూ, ‘ఈ దేశంలో ప్రజల్లో గానీ, ప్రభుత్వంలో గానీ మూడునాలుగేళ్లుగా అసహనం బాగా పెరిగిపోయింది. ఈ అసహనం కొత్తగా న్యాయవ్యవస్థకు కూడా వచ్చింది. ఏ వ్యవస్థకైతే అసహనం ఉండకూడదో, ఆ వ్యవస్థకు కూడా అది వచ్చిందంటే.. మనం ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చేసింది.. దేశమంతా ఆలోచించాల్సిన పరిస్థితి ఇది!

 ఆలోచించకుండా, ఎప్పటికప్పుడు ఎదుటి వాడిని తిట్టుకుంటూ..మనలో మనం సర్దుకుపోతున్న రోజులు కావు ఇవి! సుప్రీంకోర్టు జస్టిస్ లు నలుగురు మాట్లాడారంటే.. ఈ దేశంలో అసహనం ఎంతవరకు వెళ్లిందనేది అర్థమవుతుంది.  మన అందరమూ కలిసి ఈ ప్రభుత్వాన్ని (కేంద్రం) విపరీతమైన మెజార్టీతో గెలిపించాం. ఈ ప్రభుత్వాన్ని గెలిపించింది దేశంలో మార్పు రావాలని కానీ, అసహనం రావాలని కాదు.. ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలనే కాదు, ఫ్యాన్స్ గురించి..ఇలా ఎవరిని గురించి ఎవరు మాట్లాడినా కూడా ట్రాలింగ్ (వేధించడం) వచ్చేస్తోంది.

ఇలాంటివి మానెయ్యాలి.. ముందుగా సమస్య గురించి ఆలోచించాలి. అర్థవంతమైన ఆలోచన చేయగలిగితే పరిష్కారం లభిస్తుంది. అంతేతప్పా, కేవలం..ఒకరిని లక్ష్యంగా చేసుకుని అల్లరి చేద్దామనుకుంటే, పనికిరాని శక్తులు కొన్ని పైకొచ్చే ప్రమాదం ఉంది. ఆ పనికిరాని శక్తులు పవర్ ఫుల్ అయితే మనకు, మన దేశానికే నష్టం. మనల్ని, మన సమాజాన్ని, ప్రతి వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది’ అని అన్నారు.

More Telugu News