Chandrababu: కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధాకరం: చంద్రబాబు

  • తెలంగాణతో ఏపీకి పోలిక లేదనడం బాధాకరం
  • తలసరి ఆదాయం పెరిగితే ఇతర రాష్ట్రాలతో సమానంగా నిలుస్తాం
  • రాజధాని కాబట్టే ఏపీ ప్రజలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టారు

తెలంగాణతో ఏపీకి పోలికే లేదని కేసీఆర్ అనడం బాధాకరమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ విభజన వల్ల వచ్చిన కష్టాలని ఆయన అన్నారు. దక్షిణ భారతదేశంలో తలసరి ఆదాయంలో ఏపీ అట్టడుగున ఉందని... దీనికి కారణం ప్రజలు కాదని, రాష్ట్ర విభజన వల్లే ఇది జరిగిందని చెప్పారు. తలసరి ఆదాయం మరో రూ. 35 వేలు పెరిగితే పొరుగు రాష్ట్రాలతో సమాన స్థాయికి రాగలుగుతామని అన్నారు. రాష్ట్ర రాజధాని అనే ఉద్దేశంతోనే ఏపీ ప్రజలు హైదరాబాదులో పెట్టుబడులు పెట్టారని తెలిపారు. తెలంగాణను ఏపీ పాలకులు నాశనం చేశారని కేసీఆర్ ఆరోపణలు గుప్పించడం సరైంది కాదని చెప్పారు. హైదరాబాద్ లో 1995కు ముందు, ఆ తర్వాత జరిగిన అభివృద్ధిని పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు.

హైదరాబాద్ లో ఉన్న ఏపీ ప్రజలంతా తిరిగి ఏపీకి వస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటూ నీతి ఆయోగ్ ఛైర్మన్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ చేసిన వ్యాఖ్యల పట్ల కూడా చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాబట్టే గతంలో ఏపీ ప్రజలు అక్కడకు వెళ్లారని... ఇప్పుడు వెనక్కి రమ్మనడం సరైంది కాదని చెప్పారు. తాను తెలంగాణ ప్రజలను నిందించనని.. ఏపీ ప్రజల తప్పేమీ లేదని అన్నారు.

More Telugu News