Bhopal: హెల్మెట్ పెట్టుకోని ఎంపీ.. జరిమానా కట్టి క్షమాపణలు చెప్పిన వైనం!

  • హెల్మెట్ పెట్టుకోకుండా బండిన నడిపిన ఎంపీ
  • ఫొటో తీసి ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్‌ గ్రూప్‌లో పెట్టిన యువకుడు
  • ఇంకెప్పుడూ ఇలా చేయబోనని ఎంపీ ప్రమాణం

హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాన్ని నడిపిన ఓ ఎంపీ ఎటువంటి భేషజాలకు పోకుండా ఫైన్ కట్టి క్షమాపణలు చెప్పి శభాష్ అనిపించుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఓంకారేశ్వర్‌లో 108 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా విరాళాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం నిర్వహించిన ‘ఏక్తామ్ యాత్ర’లో భోపాల్ ఎంపీ అలోక్ సంజార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భోపాల్ ఎమ్మెల్యే సురేంద్రనాథ్ సింగ్‌తో కలిసి బైక్ నడిపారు. అయితే, ఎంపీ అలోక్ హెల్మెట్ లేకుండా బండి నడపుతుండడాన్ని గమనించిన ఓ వ్యక్తి ఫొటో తీసి దానిని ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ నంబరుకు పంపించాడు.

దీనికి స్పందించిన పోలీసులు హెల్మెట్ లేకుండా బండి నడిపినందుకు గాను రూ.250 చెల్లించాలంటూ నోటీసులు పంపారు. పోలీసు అధికారి ఈ విషయాన్ని ఫోన్ చేసి చెప్పగానే నేరుగా ట్రాఫిక్ పోలీస్ కార్యాలయానికి వెళ్లిన ఎంపీ  తనకు విధించిన జరిమానాను కట్టేసి, ఇంకెప్పుడూ ఇలా చేయనంటూ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదన్న దానికి వివరణ ఇస్తూ యాత్ర సమయంలో తాను, కార్యకర్తలు ప్రయాణిస్తున్న జీపు మొరాయించడంతో బైక్‌పై వెళ్లాల్సి వచ్చిందని, ఆ సమయంలో హెల్మెట్ పెట్టుకోవడం మర్చిపోయానని అంగీకరించారు. ఇంకెప్పుడూ హెల్మెట్ లేకుండా బండి, సీటు బెల్టు కట్టుకోకుండా కారు నడపకూడదని ఒట్టేసుకున్నట్టు అలోక్ తెలిపారు.

More Telugu News